Wednesday, January 22, 2025

‘ఆమె’ తెలంగాణ దీపిక

- Advertisement -
- Advertisement -

‘మహిళల సాధికారత అనేది ఉత్తమ కుటుంబాన్ని, ఉత్తమ సమాజాన్ని, చివరికి ఉన్నతమైన దేశాన్ని తయారు చేస్తుంది’ అని డా. అబ్దుల్ కలాం ఆలోచనల కనుగుణంగా మహిళాభ్యుదయం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నది. మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగురలేదన్న కోణంలో సిఎం కెసిఆర్ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. ‘మహిళల సాధికారత, స్వయం ప్రతిపత్తి, వారి రాజకీయ, సామాజిక, ఆర్ధిక, ఆరోగ్య స్థితిగతుల మెరుగుదల’ అనేవి సుస్థిరమైన సమగ్ర పాలనలో అంతర్భాగంగా ఉంటాయనేది కెసిఆర్ భావన.

సురక్షితమైన జీవనోపాధి, ఆర్థిక భాగస్వామ్య కల్పనల ద్వారా మహిళల ప్రాధాన్యతను మెరుగు పరచడానికి ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించడమే గాక అమలు చేసింది. మహిళల స్థితిని మెరుగుపరచడానికి ఒకే సమయంలో అన్ని చర్యలు తీసుకున్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు సఫలీకృతమవుతాయి. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కలగజేయటం, రుణ విష వలయం నుంచి బయటకు తీసుకు రావటం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యంగా అడుగులు వేస్తున్నది బిఆర్‌ఎస్ సర్కారు. సమాజంలో సగ భాగమైన స్త్రీలు అన్ని రంగాల్లో పురోగమించిన నాడే దేశాభివృద్ధి సంపూర్ణమవుతుంది. స్త్రీ శక్తిని చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళా సాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు.. వారి గౌరవాన్ని పెంచేందుకు.. స్త్రీ జనోద్ధరణే లక్ష్యంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

ఆడబిడ్డ కడుపుతో ఉన్న దశ నుంచి ఆ బిడ్డ జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, సాధికారతే లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపడుకుంటోంది. కెసిఆర్ కిట్ పథకం ద్వారా ఇప్పటి వరకు 13,90,639 మంది లబ్ధిదారులకు రూ. 1261 కోట్లు ఖర్చు చేశారు. ఆసరా పథకం కింద రూ. 1,430 కోట్లు, వితంతువులకు రూ.19 వేల కోట్లు, మహిళా బీడీ కార్మికులకు రూ. 5,393 కోట్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం ద్వారా రూ. 11,775 కోట్లు, బతుకమ్మ చీరల పంపిణీ కోసం రూ. 1,536 కోట్లు అందించిన ఘనత కెసిఆర్ సర్కార్ దే. అలాగే అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాలు భారీగా పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. విహబ్ ద్వారా చేపట్టిన 21 కార్యక్రమాల ద్వారా 2194 మంది మహిళల నేతృత్వంలోని అంకురాలతో పాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నెలకొల్పగా, మహిళల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక ఎస్టేట్‌లో 10 శాతం ప్లాట్లు రిజర్వ్ చేశారు.

తెలంగాణ ఆవిర్భవించే నాటికి కేవలం 56 శాతం అంగన్ వాడీ కేంద్రాల్లో మాత్రమే పౌష్టికాహారం ఇచ్చేవారు. ఇప్పుడు ఆరోగ్య లక్ష్శీ పథకం ద్వారా నూటికి నూరు శాతం అంగన్ వాడీల ద్వారా గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడం గొప్ప విషయం. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం అమలు చేస్తున్న ఆరోగ్యలక్ష్శీ పథకం అమలు తీరును నీతిఆయోగ్ ప్రశంసించింది. ఇది కెసిఆర్ పాలనకు దర్పణం. దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ పారితోషికాన్ని అంగన్ వాడీలకు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణయే కావడం గర్వకారణం. అలాగే ఆశా కార్యకర్తలకు రూ. 9750 లు పారితోషికం అందిస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే. మహిళా భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ ఏర్పాటు వల్ల నేరాలు, అత్యాచారాలు తగ్గుముఖం పట్టాయి.

మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇచ్చి వారికి కెసిఆర్ పెద్దన్నలా నిలిచారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అన్న ఆర్యోక్తికి అనుగుణంగా సామాజిక విలువలను మరింతగా తీర్చిదిద్దుకునే విధంగా మహిళలు సంక్షేమ పాలనలో అడుగులు వేస్తున్నారు. తొమ్మిదేళ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ రాష్ట్రం మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతోంది. మహిళా రిజర్వేషన్ల పై రాద్ధాంతం నడుస్తున్న తరుణంలో జాతీయ స్థాయిలో తెలంగాణ తరహా మహిళాభ్యున్నతి పథకాలపై జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 50 శాతం, మార్కెట్ కమిటీల్లో 33 శాతం రిజర్వేషన్లను మహళల కోసం అమలు చేస్తున్న తీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది.

సివిల్ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో 2015 నుంచి మహళలకు 33 శాతం రిజర్వేషన్లను, ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసు నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్లను వర్తింపజేసి అమలులోకి తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళాభ్యున్నతిలో తెలంగాణ సర్కార్ వినూత్న పోకడలను అనుసరిస్తూ మహిళల భుజం తట్టి ప్రోత్సహిస్తోంది.. దేశంలో ఏ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని పథకాలను అమలు చేస్తున్న సర్కార్ రాష్ట్రంలో మహిళలకూ అంతేస్థాయిలో అండగా నిలుస్తోంది. సిఎం కెసిఆర్ స్వయంగా రూపొందించి అమలు చేస్తున్న పథకాలు మహిళా రంగానికి ఉత్ప్రేరకాలుగా పని చేస్తున్నాయి. ఆర్థిక చేయూత నుంచి మొదలుకొని అన్ని అంశాల్లో మహిళకు ప్రాధాన్యత దక్కుతున్నది. ‘మహిళలను అభివృద్ధి చేయవలసిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే అభివృద్ధికే మహిళల సహకారం అవసరం’ అన్నారు- ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రెటరీ జనరల్ కోఫీ అన్నన్. మహిళల సహకారంతో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతితో దేశమంతా మనవైపు చూసేటట్టు చేశాయి. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దటీజ్ కేసీఆర్ …. దటీజ్ అవర్ తెలంగాణ…

కోలేటి దామోదర్
(చైర్మన్, తెలంగాణ రాష్ట్ర
పోలీస్ గృహ నిర్మాణ
సంస్థ లిమిటెడ్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News