కెఆర్‌ఎంబికి ఇఎన్సి మురళీధర్ లేఖ
కుడి, ఎడమ కాలువల నీటి విడుదల సామర్థ్యంల మధ్య విపరీతమైన అసమానత ఉంది
ఎడమ కాలువ 510 అడుగుల స్థాయిలో నీటి విడుదల సామర్థ్యం 7,899 క్యూసెక్కులు కాగా, కుడివైపు కాలువ సామర్థ్యం 24606 క్యూసెక్కులుగా ఉంది
1952 నాటి ఆంధ్ర, హైదరాబాద్ స్టేట్ల ఒప్పందం ప్రకారం దీనిని సవరించాలి
మనతెలంగాణ/ హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఎడమ గట్టు కాలువ నీటి ప్రవాహ సామర్థ్యం విస్తరణకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈఎన్సీ మురళీధర్ బుధవారం నాడు బోర్డు ఛైర్మన్ ఎంపి సింగ్‌కు లేఖ రాశారు. నాగార్జున సాగర్ కాలువల సామర్ధంలో అసమతుల్యతలను సవరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. 1952నాటి ఆంద్రా , హైదరాబాద్ స్టేట్ రాష్ట్రాల ఒప్పందం ప్రకారమే సాగర్ ప్రాజెక్టుకు ఇరువైపులా నీటివిడుదల సామర్దం ఉండాలని కోరారు. కుడి, ఎడమ కాలువల సామర్ధం సమానంగా ఉండాలన్నారు. రెండు కాలువల సామర్ధంలో తీవ్రమైన అసమానత ఉందని కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డు దృష్టికి తీసుకుపోయారు. సాగర్ ఎడమవైపున ఉన్న కాలువ 510అడుగుల స్థాయిలో నీటి విడుదల సామర్దం 7,899క్యూసెక్కులుగా ఉందన్నారు. అదే కుడివైపు కాలువ సామర్ధం 24606క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు రెండు వైపులా 510 అడుగుల స్థాయిలో కుడి , ఎడమ కాలువల సామర్ధం సమానంగా ఉండాలని ,నీటి విడుదల సామర్ధంలో ఉన్న తేడాలను సరిదిద్దాలని కోరారు. ఎపిలో కుడి కాలువ ఆయకట్టుకు వేరే మార్గాలు ఉన్నాయని ఈఎన్సీ మురళీధర్ కృష్ణారివర్ బోర్డు ఛైర్మన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.