పోలవరం ద్వారా ఎపి 80టిఎంసిలు తరలిస్తోంది
సాగర్ ఎడమకాల్వపై ప్రతిపాదించిన 13 ఎత్తిపోతల పథకాలపై ఎపికి అభ్యంతరం అక్కర్లేదు
కృష్ణ నదిపై ఎపి చేపట్టిన కొత్త ప్రాజెక్టులు, విస్తరణ పనులు ఆపాలి
కెఆర్‌ఎంబికి ఇఎన్‌సి మురళీధర్ లేఖ
మనతెలంగాణ/ హైదరాబాద్ : కృష్ణా జలాల నుంచి అదనంగా 45 టిఎంసిల నీటి వినియోగానికి అనుమతి ఇవ్వాలని కెఆర్‌ఎంబి చైర్మన్‌ను రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కోరారు. గురువారం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి) చైర్మన్‌కు ఆయన మూడు లేఖలు రాశారు. పోలవరం ద్వారా ఆంధ్రప్రదేశ్ 80 టిఎంసిలు తరలిస్తున్నారని.. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రానికి అదనంగా కృష్ణా జలాలు ఇవ్వాలన్నారు. సాగర్ ఎడమ కాలువల పథకాలపై ఎపికి అభ్యంతరాలు అక్కర్లేదన్నారు. ప్రతిపాదించిన 13 ఎత్తిపోతలపై అభ్యంతరాలు అవసరం లేదని ఈఎన్సీ స్పష్టం చేశారు. రూ.47 వేల కోట్లతో కృష్ణా నదిపై ఎపి ప్రాజెక్టులు చేపట్టిందని, ఆ కొత్త ప్రాజెక్టులు, విస్తరణ పనులు ఆపాలని కోరారు.
శ్రీశైలం నుంచి ఎపికి 34 టిఎంసిలకు మించి వాడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ఆరెగ్యులేటర్, ఔట్‌లెట్ల్ల వద్ద సెన్సార్లు బిగించి, సెన్సార్లతో నీటిని వినియోగం పూర్తిగా లెక్కించాలన్నారు. వాటా వాడేలా రాజోలిబండ మళ్లింపు పనులు జరుగాలన్నారు. గతేడాది డిసెంబర్ 23న జరిగిన సమావేశంలో చెన్నై నీటి సరఫరాపై తెలంగాణ రాష్ట్ర అభిప్రాయాలను తెలియజేసిందన్నారు. 1977 నాటి అంతర్రాష్ట్ర ఒప్పందాలలో, మూడు నదీ తీర రాష్ట్రాలు శ్రీశైలం జలాశయం నుంచి 15 టిఎంసి నీటిని మద్రాసు (చెన్నై)కి తాగునీటి సరఫరా కోసం జూలై నుంచి అక్టోబర్ వరకు శ్రీశైలం నుంచి పెన్నాకు ఓపెన్ లైన్ ద్వారా తరలించడానికి అంగీకరించాయని పేర్కొన్నారు.