లేఖ రాసిన ఈఎన్సీ మురళీధర్
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఈ నెల 9వ తేదీన బోర్డు సమావేశానికి హాజరుకావడం కుదరదని ఆయన లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ ఉందని.. ఈ కారణంగానే బోర్డు భేటీకి రావడం సాధ్యపడదని లేఖలో పేర్కొన్నారు. నీటిపారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సంప్రదించిన తర్వాతే తదుపరి భేటీ తేదీ ఖరారుచేయాలని ఈఎన్సీ కోరారు.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరు కావడం వీలు కాదని గురువారం తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ జిఆర్‌ఎంబీ చైర్మన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నెల తొమ్మిదో తేదీన సుప్రీంకోర్టులో, జాతీయ హరిత ట్రైబ్యునల్లో కేసుల విచారణ ఉందని ఆ కారణంగా బోర్డు సమావేశానికి హాజరవడం వీలుపడదని ఆయన ఇరు బోర్డులకు రాసిన లేఖలో ఈఎన్సీ పేర్కొన్నారు.
డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరు కావాలని..
హైదరాబాద్ జలసౌధలో ఈనెల 9వ తేదీన కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నామని కెఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. అత్యవసరంగా ఏర్పాటు చేసిన భేటీలో గెజిట్లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించాల్సి ఉన్నందున సంబంధించిన డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరు కావాలని బోర్డు సభ్యులను కోరారు.