ఓవైపు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో గత వారం రోజులనుంచి ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల అంతం కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మరోవైపు ఎపిలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని యు జీడిపాలెం పంచాయతీ పరిధిలో రెండు చోట్ల మావోయిస్టు కదిలికలను గుర్తించారు. కాకుల మామిడి, కంటారం సమీపంలో మావోయిస్టులను గమనించిన పోలీసులు కాల్పులు జరుపగా, అప్రమత్తమైన మావోయిస్టులు ఎదురుకాల్పు జరిపి చివరి నిమిషంలో తప్పించుకున్నారు.
మావోయిస్టుల కోసం పోలీసులు గాలింప చర్యలు తీవ్రతరం చేశారు. తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దులో కర్రెగుట్ట అడవుల్లో భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో సైతం 28 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ క్రమంలో కర్రెగుట్ట అడవులను భద్రత బలగాలు ముట్టడించడంతో ఎపిలోని అల్లూరి జిల్లాలోకి కొందరు మావోయిస్టులు ప్రవేశించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎపిఒడిశా సరిహద్దు ప్రాంతంలో భద్రత బలగాలు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.