రాంచి: జార్ఖండ్‌లో నక్సలైట్లతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో యాంటీ నక్సలైట్ ఫోర్స్‌కు చెందిన డిప్యూటీ కమాండెంట్ ఒకరు మృతి చెందారని ఆ రాష్ట్ర ఐజి ఎవి హోంకార్ తెలిపారు. మంగళవారం లాతేహర్ జిల్లాలోని సాలయ్య అడవిలో నిషేధిత జార్ఖండ్ జన్‌ముక్తి పరిషద్‌కు చెందిన నక్సలైట్లతో ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ నక్సలైట్ కూడా మృతి చెందారని ఆయన తెలిపారు. జార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్‌కు చెందిన డిప్యూటీ కమాండెంట్ రాజేశ్‌కుమార్(41) అనే అధికారి ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. కాల్పులు జరిపిన నక్సలైట్లు దట్టమైన అడవిలోకి పారిపోయారని ఆయన తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఎకె47సహా పలు ఆయుధాలను జప్తు చేసినట్టు ఐజి తెలిపారు. ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్ స్పందించారు. రాజేశ్‌కుమార్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఓ ధైర్యవంతుడైన అధికారిని కోల్పోయామని ఆయన ట్విట్ చేశారు.