మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: కర్రెగుటల్లో మావోయిస్టు పార్టీ వారం రోజుల నుండి కేంద్ర రాష్ట్ర కమిటీలతో ప్లీనరీ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో భారీ ఎత్తున ఆక్టోపస్ బలగాలు గుట్టను చుట్టుముట్టి స్పెషల్ కమాండోస్‌తో ఎన్‌కౌంటర్‌లను కొనసాగిస్తున్నారు. శనివారం రాత్రి వర కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు 25 మంది మావోలను పోలీస్ బలగాలు మట్టుబెట్టాయి. అయి తే, ఎన్‌కౌంటర్ మృతుల సంఖ్య ఎంత అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే, మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకులతోపాటు ఏరియా దళాలు, నాయకులు భారీ ఎత్తున కర్రెగుట్టలో ఉన్నట్టు రుజువవుతోంది. బుధవారం నుండి మొద లైన అలజడి శని వారం రాత్రి వరకు కాల్పుల వరకు దారి తీసింది. కర్రెగుటల్లో భారీ ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి చెంది న ఆదివాసీలు మూడువేల మంది వరకు గుట్టపైనున్న మా వోయిస్టుల కోసం రక్షణ కవచంగా గుట్ట మధ్యభాగంలో అడ్డుగా నిలిచారు.
వారిని తాకకుండా పోలీస్ బలగాలు ప్రత్యేక హెలికాప్టర్లతో గుట్టపైకి దిగి స్మోక్ బాంబులతో దాడిని ప్రారంభించాయి. ఆ బాంబులతో స్పృహ కోల్పోయిన వారిని కాల్చడం మొదలుపెట్టగా ఆదివాసులు తిరుగుబాటును చేపట్టారు. ఈ తిరుగుబాటులో అధికశాతం ఆదివాసులే పోలీస్ కాల్పుల్లో మరణించినట్టు తెలుస్తోంది. కొంతమంది పోలీసులు కూడా గాయపడుతున్నట్లు భోగ ట్టా. కర్రెగుట్టల్లో మారణ హోమం జరుగుతోందని పౌర హక్కుల సంఘాలు నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుపుతూ కాల్పుల విరమణ కోసం వారితో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు. అయితే, వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటే నక్సలైట్లు, ఆదివాసీలు భారీ ఎత్తున మరణిస్తున్నారనేది రుజువవుతున్నది. నిన్నమొన్నటివరకు ఎర్రగుట్టలో మావోయిస్టు నక్సలైట్లు ఉన్నారా లేరా అనేదానికి ఆధారం లేకుండా ఉంది. శనివారం ప్రొఫెసర్ హరగోపాల్ ఆధ్వర్యంలో పౌరహక్కులు, సంఘాల ప్రతినిధులతో వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మావోయిస్టులకు, ఆదివాసీలకు ప్రాణహాని ఉందని, వెంటనే కేం ద్రం, చత్తీస్‌గఢ్ ప్రభుత్వం చర్చలు జరపాలని, అక్కడ ఎ లాంటి మారణహోమం జరగకుండా పోలీస్ బలగాలను వె నక్కు రప్పించాలనడం అక్కడి పరిస్థితిని తెలియజేస్తుంది.
అసలేం జరుగుతోంది..
తెలంగాణచత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో అసలు ఏం జరుగుతుందనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. తెలంగాణచత్తీస్‌గఢ్ అడవుల్లో మావోయిస్టు పార్టీని అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆక్టోపస్ ఆధ్వర్యంలో ప్రత్యేక మిలటరీ దళాలను మోహరించి నక్సలైట్లను కాల్చిచంపుతున్నారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా వారికున్న సమాచారం మేర కు చత్తీస్‌గఢ్‌లోని ప్రధాన స్థావరాలపై దాడులు చేసి భారీ ఎత్తున నక్సల్స్ నేతలను హత మార్చి, ఆయుధసంపత్తిని స్వాధీనపరుచుకున్నారు. ఐదు రాష్ట్రాల మావోయిస్టులు పో లీసు దాడులను తట్టుకునేందుకు కార్యాచరణ, భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు గత వారం కీలకమైన నేతలు దళాలు కర్రె గుట్టల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ప్లీనరీ సమావేశాలకు సంబంధించి ఎన్ని రోజు లు నిర్వహించాలి.. అందుకు సంబంధించిన ఆహారం.. ఇతర అవసరాలకు సంబంధించిన సరంజామా మొత్తం నెల రోజులకు సరిపడా సర్దుబాటు చేసుకొని కర్రెగుట్టలోనే ఉంచినట్లు తెలుస్తోంది.
ఆయుధాలు, నగదు బంగారంతో సహా మావోయిస్టు కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ నాయకత్వం మొత్తం అక్కడ సమావేశమైనట్లు భోగట్టా. ప్రశాంతంగా జరుగుతున్న సమావేశంలో చత్తీస్‌గఢ్ నుండి మరోవైపు వెళ్లడానికి పరిస్థితిలు అనుకూలంగా ఉన్నాయా.. ఇక్కడ పోలీసు బలగాలను ఎదుర్కొంటూ యుద్ధం చేయాలనే దానిపై ప్లీనరీలోచర్చించినట్లు తెలిసింది. ఈ సమయంలోనే పోలీసులకు విషయం తెలియడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలు చుట్టుముట్టడంతో మావోయిస్టు అధినాయకత్వం ఆందోళనకు గురై అక్కడి నుండి ఎస్కేప్ కావడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రాంతానికి సంబంధించిన మావోయిస్టు నాయకులు ఎక్కువగా ఉండటం వల్ల ఆదివాసీల మద్దతు కలిసి రావడంతో పాటు కీలక నేతలు, కొన్ని దళాల ప్రతినిధులు, సభ్యులు కూడా రహస్యదారుల గుండా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ అక్కడ ఆదివాసీలు ఎక్కువగా ఉండడం వల్ల వారిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా 3,000 మంది ఆదివాసీలు కర్రెగుట్టల పైకి వచ్చారని భోగట్టా.
ప్రస్తుతం కర్రె గుట్టల గుహల్లో ఒరిజినల్ మావోయిస్టు దళాలు కొన్ని ఉండవచ్చుననే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. వారితోపాటు ఆదివాసీలు, వారితో కలిసి పనిచేసినందున వారిని కూడా పోలీసులు టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నుండి పోలీసు బలగాలు హెలికాప్టర్ ద్వారా గుట్టపైకి చేరుకొని స్మోక్ బాంబులు వేసి స్పృహ కోల్పోయిన వారిని చంపేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం వరకు కర్రెగుట్టలో ఎంతమంది మావోయిస్టులు మరణించారనేది ఇంకా స్పష్టత లేకపోయినా..దాదాపు 25 మంది వరకు ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసింది. పోలీసులు కూడా మావోయిస్టులు మరణిస్తే వారి డెడ్‌బాడీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతున్నందున పూర్తిస్థాయిలో సెర్చ్ కానందున పోలీస్ బలగాలు కూడా అక్కడ ఏం జరుగుతుందనేది ప్రకటించడం లేదు. కర్రెగుట్టల్లో కూడా మావోయిస్టు అగ్రనేతల సభ్యుల కన్నా ఆదివాసీలే బలవుతున్నానేది పౌరహక్కుల సంఘాలు చెబుతున్న మాట. రాష్ట్రపతికి, హోంశాఖకు ఎవరు ఎన్ని రకాలుగా ఆక్రోసించినా, ఎవరికి విజ్ఞాపన చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో ఆదివాసీల ఊచకోత కొనసాగుతూనే ఉందనేది పౌర హక్కుల సంఘం నేతల ఆవేదన.
చుట్టున్న గ్రామాలను దిగ్బంధించిన పోలీసులు …
కర్రెగుటల్లో ఉన్న మావోయిస్టు పార్టీ దళాలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందకుండా ఉండేందుకు పోలీసు బలగాలు ఆ గ్రామాలను దిగ్బంధించాయి. దీంతో ఆదివాసీ గ్రామాలన్నీ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. మంచినీళ్లు, ఆహారసరుకులు, ఇతర వనరులు వారికి అందకుండా ఎవరూ సహాయ పడకుండా ఉండేందుకు చుట్టూ పోలీసు క్యాంపులను ఏర్పాటు చేశారు. దానివల్ల ఎన్ని రోజులు కర్రెగుటల్లో మావోయిస్టులు ఉన్నా వారికి ఆహార వస్తువులు అందకపోతే బయటకు రావడం లేకుంటే అందులోనే ఎన్‌కౌంటర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో పోలీసులు చక్రబంధం చేశారు. ప్రస్తుతం ఐదు రోజుల నుండి పోలీసులు గ్రామాలను దిగ్బంధించడంతో ప్రజలు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పోలీస్ బలగాల అదుపులో కేంద్ర కమిటీ సభ్యుడు….
కర్రే గుట్టలో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌లో పోలీస్ బలగాలు కేంద్ర కమిటీ సభ్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రహస్య మార్గాల నుండి వెళ్తున్న మావోయిస్టులపై నిఘాను ముమ్మరం చేసిన పోలీస్‌లు వారిని అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలిసింది.