శ్రీనగర్ : శ్రీనగర్ లోని అలూచిబాగ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్ పోలీసులు హతమార్చారు. ఒక ప్రాంతంలో వారు ఉన్నట్టు సమాచారం అందగానే పదిమంది జవాన్లు అక్కడకు వెళ్లి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని, వారిని ఎదుర్కోడానికి పోలీసులు కాల్పులు జరపగా ఆ ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారని కశ్మీర్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్‌కుమార్ విలేఖరులకు తెలిపారు. అబ్బాస్ షేక్, సకీబ్ మంజూర్ అనే ఈ ఉగ్రవాదులు లష్కర్ ఇ తొయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫోర్స్ (టిఆర్‌ఎఫ్) కు చెందిన వారని విజయ్‌కుమార్ చెప్పారు. ఈ ఇద్దరినీ హతమార్చడం భద్రతాదళాలకు పెద్ద విజయంగా ఆయన పేర్కొన్నారు. శ్రీనగర్ లోని అనేక మందిని హతమార్చడానికి వీరే కారకులని, అంతేకాక యువతను ఉగ్రవాదం వైపు మళ్లించి చేర్చుకోవడంలో వీరు కీలక పాత్ర వహిస్తున్నారని చెప్పారు.