Tuesday, November 5, 2024

26మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

Encounter of 26 Maoists in Gadchiroli

నెత్తుటి మడుగులో గడ్చిరోలి

మావోయిస్టుల ఆచూకీ తెలుసుకొని కూంబింగ్‌కు వెళ్లిన కమాండో దళం శనివారం తెల్లవారుజామున దళంపై కాల్పులు జరిపిన మావోయిస్టులు కొనసాగిన ఎదురుకాల్పులు 12మంది నక్సల్స్‌తో హోరాహోరీ పోరు తొలుత నలుగురే అనుకున్న నక్సల్స్ మృతుల సంఖ్య 26కు చేరిక మరికొందరు మావోయిస్టులు పరారీ ముగ్గురు పోలీసులకు గాయాలు మృతదేహాలు గడ్చిరోలి ప్రధాన ఆసుపత్రికి తరలింపు

మనతెలంగాణ/మంచిర్యాల, నాగ్‌పూర్ : మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా దట్టమైన అడవులలో శనివారంనాడు జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 26మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. కాల్పులు జరుపుతూ మరికొందరు మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. తెల్లవారుజామున ఇరుపక్షాల నడుమ మొదలైన కాల్పులు కొన్ని గంటల పాటు సాగాయి. ‘కాల్పుల ఘటన తర్వాత 26 మృతదేహాలు స్వాధీనం చేసుకున్నాం. మృతదేహాలన్నీ మావోయిస్టులవే’ అని జిల్లా ఎస్‌పి అంకిత్ గోయల్ మీడియాకు వెల్లడించారు. మావోయిస్టులు గ్యారపట్టి అటవీప్రాంతంలో ఉన్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. కోర్సి పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్దిన్‌టోలా అటవీ ప్రాంతంలో సి-60 బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి.

తొలుత నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రకటించినప్పటికీ రాత్రికల్లా 26మంది మావోయిస్టులు తమ కాల్పుల్లో మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. మృతులలో కొందరు మహి ళా నక్సల్స్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో కొంత మేరకు ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నక్సల్స్ ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం నుంచి గడ్చిరోలికి చేరుకున్నట్లు సమాచారం అందడంతోనే తాము కమాండో దళాన్ని అప్రమత్తం చేసినట్లు, వారు కీకారణ్యంలో గాలిస్తూ ఉండగా ఎన్‌కౌంటర్ జరిగినట్లు ఎస్‌పి వివరించారు. మృతదేహాలను గడ్చిరోలీలోని ప్రధాన ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతులను గుర్తించాల్సి ఉందన్నారు. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు గోయల్ వెల్లడించారు. గాయాలపాలైన పోలీసులను నాగ్‌పూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్‌తుంబ్డే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపారు. భీమా కోరేగావ్ ఘర్షణల్లో ఇతని కోసం పూణే పోలీసులు చాలా కాలంగా గాలిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News