కొత్తవారిని తయారు చేయడంలో ఆనందం వేరు. మంచి కథలకు, కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించడానికి కథాసుధ గొప్ప వేదిక”అని అన్నారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. కె. రాఘవేంద్రరావు, దర్శకుడు సతీష్ వేగేశ్న సూపర్ విజన్‌లో ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది కథాసుధ. ప్రతి ఆదివారం ఓ అద్భుతమైన కథతో అలరించబోతోంది. ‘కథాసుధ’కి సంబంధించిన టైటిల్, ప్రోమో లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్‌లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, డైరెక్టర్ సతీష్ వేగ్నేశ, బివిఎస్ రవి, తనికెళ్ళభరణితో పాటు కథాసుధ టీం అంతా పాల్గొన్నారు.
ప్రెస్‌మీట్‌లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ “కొత్త దర్శకులు, రచయితలు, నటీనటులను పరిచయం చేయొచ్చు అనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది. శాంతి నివాసం ద్వారా రాజమౌళిని పరిచయచేసి తర్వాత దర్శకుడిగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాని చేయడం జరిగింది. దానికి బహుమతిగా రాజమౌళి బాహుబలి సినిమాని ఇచ్చారు. శాంతి నివాసం నుంచి ఇప్పుడు కలిసుందాం రా వరకు ఈటీవీకి, నాకు ఆ అనుబంధం కొనసాగుతూనే ఉంది. కొత్త దర్శకులు, రచయితలు, నటీనటులు కథా సుధాతో పరిచయం కావడం చాలా ఆనందంగా వుంది”అని అన్నారు.
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “బిగ్ స్క్రీన్‌లో అద్భుతమైనటువంటి మరపురాని చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొత్త వారిని ప్రోత్సహించడానికి ముందుకు రావడం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆయన్ని చూసి చాలా నేర్చుకోవాలి”అని తెలిపారు. దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ “కథాసుధలో ఐదు కథలని 20 రోజుల్లో తీశాం. ఈ కథలన్నీ అందరినీ అలరిస్తాయి. ఇందులో మిమ్మల్ని తట్టి లేపే జ్ఞాపకాలు ఉంటాయి. మీరు మర్చిపోలేని అనుభూతులు ఉంటాయి”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నటలు బాలాదిత్య, సోనియా, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.