సముద్ర జలాల్లోని పగడాల దిబ్బల్లో మసలాడే షార్క్ (సొర), రే(టేకి) చేపల్లో దాదాపు రెండింట మూడొంతులు అంతరించి పోతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. సాధారణంగా షార్క్, రే చేపల తెగలకు అంతరించిపోయే ముప్పు రెట్టింపు ఉండగా, 59 శాతం షార్క్, రే చేపల తెగలు అంతరిస్తున్నాయని పేర్కొంది. వీటిలో ఐదు రకాల షార్క్ తెగలు, తొమ్మిది రకాల రే చేపల తెగలు అత్యంత ప్రమాదకరంగా తమ ఉనికిని కోల్పోయే పరిస్థితిలో ఉన్నాయని వివరించింది. స్టింగ్ రే చేపల కన్నా రైనో రే చేపలు మరీ అంతరిస్తున్నాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి సముద్రంలో జీవిస్తున్న షార్క్ చేపల సంతతికి మధ్యధరా సముద్రంలో ముప్పు ఏర్పడుతోంది.అతిగా చేపలను వేటాడడం, ప్లాస్టిక్ కాలుష్యం, వాటి పాలిట మృత్యుగండంగా మారుతున్నాయి.
ఈ సముద్రంలో సగం కన్నా ఎక్కువ శాతం షార్క్, రే చేపలు ప్రమాదం అంచున ఉన్నాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (డబ్లుడబ్లుఎఫ్ ) వివరించింది. అన్ని దేశాల కన్నా లిబియా, టునీషియా, దేశాల్లో ఈ చేపల వేట అత్యధికంగా సాగుతోంది. ఏటా 4200 టన్నుల షార్క్, రే చేపలను వేటాడుతున్నారు. కొన్నిటిని కేవలం ఆహారం కోసమే వేటాడుతుండగా, మధ్యధరా సముద్రంలో మాత్రం ఇతర చేపలను వేటాడడానికి షార్క్ చేపలను ఎరగా వినియోగిస్తున్నారు. ఈ విధంగా 60 రకాల షార్క్ చేపలు వేటకు ఎరగా బలైపోయాయని పరిశోధకులు వెల్లడించారు.
దీంతోపాటు ప్లాస్టిక్ కాలుష్యం కూడా వీటికి ప్రాణాంతకమవుతోంది. షార్క్ చేపల జాతులు 400 మిలియన్ సంవత్సరాల కన్నా ముందు నుంచి సాగర జలాల్లో ఉంటున్నాయి. అయితే ఇవి మెల్లగా ఎదుగుతుంటాయి. సంతానోత్పత్తి కూడా ఆలస్యంగా సాగుతుంది. షార్క్ తెగలు 79, రే చేపల తెగలు 120 ప్రమాదంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తిమింగల షార్కులు, తెల్లషార్కులు, టైగర్ షార్కులు, తదితర షార్కులు ప్రమాదంలో ఉంటున్నాయని చెబుతున్నారు.