Monday, December 23, 2024

బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత

- Advertisement -
- Advertisement -

మరిపెడ: బాల్య వివాహాల నిర్మూలన, మానవ అక్రమ రవాణా నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి, వాటి నివారణకు కృషి చేయాలని ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్ అన్నారు. బుధవారం మరిపెడ మండల పరిషత్ కార్యాలయంలో ఎఫ్‌ఎంఎం సాంఘీక సేవా సంస్ధ ఆధ్వర్యంలో సంస్ధ కోఆర్డినేటర్ కరుణ అధ్యక్షతన బాలల అక్రమ రవాణా అనే అంశంపై విద్యార్ధులకు, చైల్డ్‌క్లబ్ ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎఫ్‌ఎంఎం ప్రాజెక్ట్ ఆఫీసర్ కన్వీనర్‌గా వ్యవహరించి బాలల అక్రమ రవాణా, బాలలపై లైంగిక వేధింపులు, బాల్య వివాహాల నిర్మూలన చట్టం, మానవ అక్రమ రవాణా నిర్మూలన చట్టాలు, బాలల సమస్యల గురించి వివరించారు.

ఈ కార్యక్రమానికి మరిపెడ ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, ఎస్‌ఐ ఝాన్సీ, ఎంపిడిఓ కేలోతు ధన్‌సింగ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపిపి అరుణ మాట్లాడుతూ చిన్నతనంలోనే పెళ్లిలు చేయడం ద్వారా అనేక అనర్ధాలు, మనస్పర్ధాలు ఏర్పడుతాయని వివరించారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాతే పెళ్లిలు చేయాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల ఎదురయ్యే సమస్యలు ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, మానవ అక్రమ రవాణా, మొబైల్ వాడకం వల్ల ఎదురైయ్యే సమస్యలు, కిషోర బాలికలు ప్రేమ పేరుతో మోసపోతున్న విధానాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

బాల్య వివాహాలు చట్టప్రకారం నేరం: ఎస్‌ఐ ఝాన్సీ
బాల్య వివాహాలు చట్టప్రకారం నేరమని ఎస్‌ఐ ఝాన్సీ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏళ్లు నిండకుండా వివాహాలు చేయవద్దని, చట్టాలను ఉలంఘించి బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. 18 ఏళ్లలోపు బాల బాలికలపై లైంగిక నేరాల నియంత్రించుటకు చట్టం రూపొందించబడిందని, మైనర్ బాలికలను వివాహం చేసుకోవడం, ప్రేమ పేరుతో మోసం చేయడం, లైంగిక వేధింపులకు గురి చేయడం ఇవన్ని కూడా చట్టం పరిధిలోకి వస్తాయని వివరించారు.

తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు తమ పిల్లలకు ఇలాంటి విషయాలు, చట్టాలపై అవగాహన కల్పించవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న వారు తమ గ్రామంలో భవిష్యత్తులో బాల్య వివాహాలు చేయమని, బాలల, మహిళల చట్టాలపై అవగాహనతో ఉంటామని ఎలాంటి సమస్య ఉన్న సంబంధిత టోల్ ఫ్రీ నెంబర్‌కు, అధికారులకు సమాచారం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌లైన్ వెంకటేష్, కౌన్సిలర్ నల్లమాస అరుణ, కె. వెంకటేష్, అనిల్ కుమార్, సరోజా, ఉపేందర్, కళ్యాణి, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News