భారత్, పాకిస్తాన్ సరిహద్దుకు చేరువలో పునరుపయోగ విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి మంజూరుపై బుధవారం లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు, ముఖ్యంగా కాంగ్రెస్, డిఎంకె సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ‘సంతృప్తికర సమాధానం రాకపోవడంతో’ వారు ఆతరువాత సభలో నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ ప్రశ్నోత్తరాల సమయంలో ఒక అనుబంధ ప్రశ్న అడుగుతూ, జాతీయ భద్రత, ఇంఢనశక్తి భద్రత కలసి సాగవలసి ఉంటుందని అన్నారు. పునరుపయోగ విద్యుత్ ప్రాజెక్టు అంతర్జాతీయ సరిహద్దు (ఐబి)కి ఒక కిలోమీటర్ సమీపం వరకు ఏర్పాటు అవుతుందని ఆయన చెప్పారు. భద్రత ప్రొటోకాల్ ప్రకారం, ఏ భారీ మౌలికవసతుల కల్పన ప్రాజెక్టు అయినా ఐబికి కనీసం పది కిలోమీటర్ల దూరంలో ఉండాలని ఆయన అన్నారు.
ప్రతిపాదిత ప్రాజెక్టుకు ఏ సడలింపు అయినా మంజూరు చేశారా అని తివారీ అడిగారు. ఏ ప్రతిపాదనకైనా అనుమతులు, లైసెన్సులు కేంద్రం, రాష్ట్రం, సంబంధిత ఏజెన్సీల నుంచి ఆమోదం పొందిన తరువాతే మంజూరు అవుతుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో పునరుపయోగ విద్యుత్ ఉత్పత్తి పట్ల ప్రభుత్వం ఆసక్తితో ఉందని నూతన, పునరుపయోగ విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. లైసెన్సుల జారీకి, అనుమతి మంజూరుకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత ఏజెన్సీల నుంచి ఆమోదముద్ర కోరినట్లు మంత్రి తెలిపారు. మంత్రి సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు జాతీయ భద్రతపై నినాదాలు చేసి, సభ మధ్యంలోకి దూసుకుపోయారు. వారు డిఎంకె సభ్యులతో పాటు ఆతరువాత వాకౌట్ చేశారు.