Wednesday, October 2, 2024

బంగారు బతుకమ్మ

- Advertisement -
- Advertisement -

సమాజంలో, కుటుంబంలో మహిళల ప్రాధాన్యతను, గౌరవాన్ని చాటి చెప్పే పండగ బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్ర ప్రసిద్ధ పండగ ఈ బతుకమ్మ. ఇది పడతుల ప్రత్యేక పండగ. బతుకమ్మ బతుకుని కొలిచే పండగ. బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భవిస్తూ, అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు లక్ష్మీ, గౌరిదేవిలను అభేదిస్తూ, ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలను నైవేద్యంగా సమర్పిస్తూ మనకున్నంత లో కొత్త బట్టలు, నగలు, ధరిస్తూ ఆడబిడ్డల్ని పండగకు ఆహ్వానించి జరుపుకునే గొప్పవేడుక బతుకమ్మ.

ఈ పండుగ విషయానికి వస్తే అశ్వీయుజ మాసం వస్తుందంటే బతుకమ్మ పండుగ వచ్చినట్లే. భాద్రపద అమావాస్య నుంచి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండగ రాష్ట్రంలో ఎంతో వైభవంగా జరుపుకుంటాం. ఆశ్వీయుజ శుద్ధపాఢ్యమికి ముందు వచ్చే అమావాస్య రోజు పితృ అమావాస్యగా లేక ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. ఆనాటి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు ఈ వేడుకను జరుపుకుంటాం. మహర్నవమిగా నవమి రోజు సద్దుల బతుకమ్మ పండగ పేరుతో పెద్దఎత్తున బతుకమ్మ పేర్చుకొని వైభవంగా పండగను జరుపుకుంటాం. తీరుతీరు పూలతో, తీరైన వంటలతో తల్లిని కొలుస్తూ పాడే పాటలు తమ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో కూడిన పాటలు, బతుకమ్మ పండుగలో పాడుకునే పాటలు ఎన్నో. బతుకమ్మ పండుగ ఒక సంప్రదాయంగా, ఒక ఆటగా, ఒక పాటగా చిన్నప్పటి నుంచి సుపరిచితమే. ఎవరు బాగా చేస్తారు? ఎవరు ఎక్కువగా పాటలు పాడతారు? ఇలా ఇవన్నీ సద్దుల బతుకమ్మ రోజు పొద్దుటి నుండే ఇంట్లో హడావుడిగా ఉంటుంది.

ఇక బతుకమ్మ ప్రారంభమైన మొదటి రోజు నుండి తొమ్మిదవ రోజు అంటే సద్దుల బతుకమ్మ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేక నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారు. మొదటి రోజు వక్కలు, తులసి ఆకులు, సత్తు పిండి మొదలైనవి. రెండవ రోజు బెల్లంవేసి ఉడికించిన శనగపప్పు, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానిన బియ్యం, ఐదవ రోజు అట్లుపోసి ప్రసాదంగా పంచుతారు. ఆరవ రోజు బతుకమ్మ ను పేర్చడం, ఆడడం ఉండదు. ఆ రోజు బతుకమ్మ అలిగింది అనే విశ్వాసం ఒకటుంది. ఇక ఏడవ రోజు పప్పు బెల్లం, ఎనిమిదవ రోజు నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు ప్రసాదంగా పంచుకుంటారు. ఇక తొమ్మిదవ రోజు నాటి బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటాము. పండగ ఉత్సాహమంతా ఈ రోజు అధికంగా కనిపిస్తుంది. దసరా పండుగకు ముందు రోజున ఈ బతుకమ్మ పండగ.

ఇప్పటికే ఆడపడచులందరూ పుట్టింటికి చేరడంతో ఇళ్ళన్నీ కోలాహలంగా పల్లెను చేరే వాళ్ళతో ఊర్లన్నీ సంబరంగ ఉంటాయి. అంతేకాదు ఈనాటి బతుకమ్మ ను ఎక్కువ పూలతో చాలా పెద్దగా చేసి ఐదు రకాల సద్దులు, లేక తొమ్మిది రకాల సద్దులు కలిపి నైవేద్యంగా కలిపి పూజ చేస్తారు. ఇక బతుకమ్మను పేర్చే విధానానికి వస్తే గునుగు, తంగేడు పూలతో పాటు మిగతా రంగురంగుల పూలు వలయకరంగా, ఆకర్షణీయంగా ఉండే విధంగా బతుకమ్మను తయారు చేస్తారు. పూజించే తీరును బట్టి ప్రజలు తనను ఆరాధించడానికే శక్తి ఆ రూపాన్ని కోరిందా అనిపిస్తుంది. బతుకమ్మ పండగ రోజు సాయం కాలం గ్రామంలోని గుడి ముందర లేదా కాళీ స్థలంలో బతుకమ్మను ఆడే చోట వెంపలి చెట్టుగాని, పిండి చెట్టు గాని పెట్టి గౌరమ్మను నిలిపి పూజ చేసి ఆట ప్రారంభిస్తారు.

ఒకరు పాట చెప్పడం, మిగిలిన వాళ్ళు పాడడం చేస్తారు. బతుకమ్మ పాటలు ఎన్నో ఉన్నప్పటికీ బహుళ ప్రచారంలో ఉన్న పాటలు శ్రీలక్ష్మినీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ… శ్రీగౌరి నీపూజ ఉయ్యాలో… ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఇలా పాడుతూ శుభం కలగాలని గౌరమ్మని వేడుకుంటారు మహిళలు. ఆట అయ్యాక పసుపు గౌరమ్మను తీసి చివరకు బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఆ పళ్లెంలో తెచ్చిన నీటితో, పసుపు గౌరమ్మతో వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు. తర్వాత ఇంటి నుంచి తెచ్చిన పెరుగన్నం, సత్తు పిండి, పల్లి పిండి, బెల్లం, పంచదార కలిపి చేసిన ప్రసాదాలను పంచుకుంటారు.

టి. సంయుక్తా కృష్ణమూర్తి
8500175459

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News