సిటిబ్యూరోః తన కుమారుడు చేసింది ముమ్మాటికి తప్పేనని, నవీన్ తల్లిదండ్రులు తమను క్షమించాలని స్నేహితుడిని హత్య చేసిన హరిహరకృష్ణ తండ్రి పేరాల ప్రభాకర్ అన్నారు. నల్గొండ ఎంజి యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగం చేశారు. ఆదివారం హరి తండ్రి ప్రభాకర్ మీడియాతో మాట్లాడాడు. హరిహరకృష్ణ వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన వారు. ప్రభాకర్ ఆర్‌ఎంపి డాక్టర్‌గా పనిచేస్తుండగా, ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్నవాడు హరిహరకృష్ణ, పెద్దకుమారుడు ముఖేష్‌కృష్ణ 2010లో జరిగిన హ్యత కేసులో నిందితుడిగా ఉన్నాడు. ముఖేష్ కృష్ణ 2011,జూన్ 15వ తేదీన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చిన్న కుమారుడైన బుద్దిమంతుడు కావాలని భావించిన ప్రభాకర్ హైదరాబాద్‌లో ఉంచి చదివస్తున్నాడు. దీంతో సుమారు 14 ఏళ్ల నంచి హరి హైదరాబాద్‌లో సోదరి ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నవీన్‌తో ఏర్పడిన స్నేహం ఏర్పడి ఇద్దరు ప్రాణస్నేహితులుగా మారారు. ఐదు నెలల క్రితమే ఐదారుగురు స్నేహితులు కలిసి రూమ్ తీసుకున్నారని ప్రభాకర్ తెలిపారు. మహాశివరాత్రి రోజు వరంగల్‌కు వచ్చాడని, ఫోన్లు చాలా రావడంతో ఆందోళనగా కనిపించాడని తెలిపాడు. ఏమైందని అడిగినా చెప్పకుండా హైదరాబాద్‌కు వెళ్లాడని తెలిపారు. తర్వాత రెండు రోజుల పాటు మొబైల్ స్విఛ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి రాలేదని తెలిపాడు. అప్పటికే నవీన్ మిస్సింగ్‌పై కేసు నమోదు కావడంతో తాము ఆందోళన చెందామని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు.
ఈ నెల 23వ తేదీన హరి మళ్లీ వరంగల్‌కు వచ్చాడని, ఏం జరిగిందని నిలదీస్తే అసలు విషయం అప్పుడు చెప్పాడని, నవీన్‌కు తనకు గొడవ జరిగిందని,ఆ గొడవలో నవీన్ చనిపోయాడని చెప్పాడు. మందలించి వెంటనే పోలీసులకు లొంగిపోవాలని చెప్పామని తెలిపాడు. స్థానికంగా కాకుండా హైదరాబాద్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోతానని చెప్పాడని అలాగే చేశాడని తెలిపారు. ఈ హత్య మా అబ్బాయి ఒక్కడే చేసినట్లు అనిపించడంలేదని, ఇంకా కొందరు ఉండవచ్చని, అమ్మాయి కోసం హత్య అంటున్నారు, కాబట్టి ఆమెను కూడా విచారించాలని అప్పుడు వాస్తవాలు తెలుస్తాయని చెప్పాడు. తన కుమారుడికి నేర చరిత్ర లేదని, గంజాయి తీసుకోడని, మద్యం తాగే అలవాటు ఉందని, ఆ మత్తులో హత్య చేశాడని భావిస్తున్నామని తెలిపాడు. చదువులో ముందు ఉంటాడని, ఏదో జరిగిఉంటుందని అనుమానంగా ఉందని తెలిపాడు.