తొలి రోజు పరుగుల సునామీ
శతకాలతో కదంతొక్కిన క్రాలి, డుకెట్, పోప్, బ్రూక్
ఇంగ్లండ్ 506/4, స్టోక్స్ సేన ప్రపంచ రికార్డు
పాకిస్థాన్‌తో మొదటి టెస్టు
రావాల్పిండి: పాకిస్థాన్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ బ్యాటర్లు కదంతొక్కారు. ఏకంగా నలుగురు బ్యాట్స్‌మెన్ శతకాలతో చెలరేగి పోయారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. ఇదే క్రమంలో టెస్టు మ్యాచ్‌లో ఒకే రోజు అత్యధిక పరుగులు సాధించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఓపెనర్లు, జాక్ క్రాలి, బెన్ డుకెట్, ఓలి పోప్, హారి బ్రూక్‌లు శతకాలతో రాణించారు. వీరిని కట్టడి చేయడంలో పాకిస్థాన్ బౌలర్లు పూర్తిగా చతికిల పడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలి, బెన్ డుకెట్ శుభారంభం అందించారు. ఇద్దరు ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఆరంభం నుంచే వీరు దూకుడుగా ఆడారు. వీరి బ్యాటింగ్ పరిమిత ఓవర్ల బ్యాటింగ్‌ను తలపించింది.
ఇటు క్రాలి, అటు డుకెట్ అసాధారణ బ్యాటింగ్‌ను కనబరచడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన డుకెట్ 15 ఫోర్లతో వేగంగా 107 పరుగులు చేశాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 233 పరుగులు జోడించాడు. మరోవైపు ధాటిగా బ్యాటింగ్ చేసిన క్రాలి 21 ఫోర్లతో 122 పరుగులు చేసి వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ ఓలి పోప్ కూడా దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. అయితే స్టార్ బ్యాటర్ జో రూట్ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన పోప్ 14 ఫోర్లతో 108 పరుగులు సాధించాడు.
తర్వాత వచ్చిన హారి బ్రూక్ కూడా శతకంతో కదంతొక్కాడు. పాకిస్థాన్ బౌలర్లను హడలెత్తించిన బ్రూక్ 81 బంతుల్లోనే 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 15 బంతుల్లోనే 34 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. దీంతో తొలి రోజు ఆట నిలిపివేసే సమయానికి ఇంగ్లండ్ 75 ఓవర్లలోనే రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది.
4⃣4⃣4⃣4⃣4⃣4⃣ 😯
24 runs in an over for Harry Brook 🔥#WTC23 | #PAKvENG | https://t.co/PRCGXi3dZS pic.twitter.com/iF5jmAUWeV
— ICC (@ICC) December 1, 2022
England creates record against Pakistan in 1st Test