ధర్మశాల: ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరిగే ఐదో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియాకే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 31తో సొంతం చేసుకుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి పాలైన టీమిండియా ఆ తర్వాత పుంజుకుంది. తర్వాత ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. ఇప్పటికే సిరీస్ సొంతం కావడంతో భారత్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. దీంతో ఆఖరి టెస్టు మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. గురువారం నుంచి ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులో చేరాడు. బుమ్రా చేరికతో బౌలింగ్ విభాగం మరింత బలోపేతంగా తయారైంది.
ధర్మశాల మ్యాచ్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రోహిత్ సేన సమతూకంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, జడేజా, అశ్విన్, ధ్రువ్ జురెల్ తదితరులతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. యశస్వి ఈ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు బాదేశాడు. చివరి టెస్టులోనూ సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కూడా యశస్వి జట్టుకు కీలకంగా మారాడు. జైస్వాల్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సిరీస్‌లో ఓ శతకం నమోదు చేశాడు. శుభ్‌మన్ గిల్, జడేజాలు కూడా శతకాలతో అలరించారు. అయితే యువ ఆటగాడు రజత్ పటిదార్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ నిరాశ పరిచాడు. అతనికి ఈ మ్యాచ్‌లో ఛాన్స్ దక్కడం కష్టమేనని చెప్పాలి.
అతని స్థానంలో దేవ్‌దుత్ పడిక్కల్‌ను తుదిజట్టులో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జురెల్ రూపంలో భారత్‌కు మరో పదునైన అస్త్రం లభించింది. రాంచి టెస్టులో జురెల్ అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. సిరాజ్, బుమ్రా, అశ్విన్, జడేజా, ఆకాశ్, కుల్దీప్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు విభాగాల్లో సమతూకంగా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఇక ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ పూర్తిగా డీలాపడిపోయింది. జోరుమీదున్న టీమిండియాను ఓడించాలంటే ఇంగ్లండ్ టీమ్ అసాధారణ ఆటను కనబరచక తప్పదు. అయితే ప్రస్తుతం భారత్ ఉన్న స్థితిని గమనిస్తే ఇంగ్లండ్‌కు ఇది అసాధ్యమేనని చెప్పాలి.