చెలరేగిన రాబిన్‌సన్, పుజారా సెంచరీ మిస్, మూడో టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం
లీడ్స్: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో భారత ఇన్నింగ్స్‌ను లంచ్ లోపే పరిమితం చేశారు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్‌ను 11తో సమం చేసింది. 212/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా తొలి సెషన్‌లోనే మిగిలిన 8 వికెట్లను కోల్పోవడం గమనార్హం. ఇంగ్లండ్ బౌలర్ రాబిన్‌సన్ ఐదు వికెట్లు పడగొట్టి టీమిండియాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
ఆరంభంలోనే..
ఇక నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కిందటి రోజు అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా ఎక్కువ సేపు క్రీజులో నిలువడంలో విఫలమయ్యాడు. 91 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రాబిన్‌సన్ బౌలింగ్‌లో వికెట్ల ముందుకు దొరికిపోయాడు. దీంతో పుజారా 9 పరుగుల తేడాతో శతకం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక కొద్ది సేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఔటయ్యాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లిని కూడా రాబిన్‌సన్ వెనక్కి పంపాడు. రాబిన్‌సన్ బంతిని అంచన వేయడంలో విఫలమైన కోహ్లి (55) స్లిప్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక జట్టును ఆదుకుంటారని భావించిన అజింక్య రహానె, రిషబ్ పంత్‌లు కూడా నిరాశ పరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా వీరిద్దరూ పేలవమైన బ్యాటింగ్‌ను కనబరిచిన విషయం తెలిసిందే. ఈసారి రహానె (10), పంత్ ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. మరోవైపు రెండో టెస్టులో అద్భుతంగా రాణించిన మహ్మద్ షమి కూడా నిరాశే మిగిల్చాడు. ఈ మ్యాచ్‌లో షమి ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
ఇక ఒంటరి పోరాటం చేసిన రవీంద్ర జడేజా ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఇషాంత్ శర్మ (2), సిరాజ్ (0) కూడా జట్టుకు అండగా నిలువడంలో విఫలమయ్యారు. జస్‌ప్రిత్ బుమ్రా ఒక పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఒక దశలో 215/2తో పటిష్టస్థితిలో ఉన్న టీమిడియా 99.3 ఓవర్లలో 278 పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. మూడో రోజు పుజారా, కోహ్లి పోరాటం చేస్తే ఈ మ్యాచ్‌లో టీమిండియా కోలుకున్నట్టే కనిపించింది. అయితే శనివారం ఆట ఆరంభం నుంచే భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్‌సన్ ఐదు, ఓవర్టన్ మూడు వికెట్లు పడగొట్టారు. రాబిన్‌సన్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
కనీస పోరాటం లేకుండానే..
ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో టీమిండియా బ్యాట్స్‌మెన్ కనీస పోరాటం చేయకుండానే చేతులెత్తేయడం అభిమానులను నిరాశకు గురి చేసింది. కిందటి రోజు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన చటేశ్వర్ పుజారా ఈ రోజు ఆరంభంలోనే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే కెప్టెన్ కోహ్లి కూడా ఔట్ కావడంతో భారత్ మళ్లీ కోలుకోలేక పోయింది. కీలక ఆటగాళ్లు అజింక్య రహానె, రిషబ్ పంత్‌లు తమ పేలవమైన బ్యాటింగ్‌ను ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగించారు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొవడంలో ఇద్దరు విఫలమయ్యారు. టయిలెండర్లు కూడా విఫలం కావడంతో భారత్‌కు ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సిరీస్‌ను 11తో సమం చేసింది. తొలి మ్యాచ్ డ్రాగా ముగియగా, రెండో టెస్టులో టీమిండియా జయకేతనం ఎగుర వేసింది.