Tuesday, December 17, 2024

తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 246 ఆలౌట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ పైచేయి సాధించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి 23 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే భారత్ మరో 127 పరుగులు చేయాలి.

శుభారంభం లభించినా..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. క్రాలీ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా, డకెట్ వేగంగా ఆడాడు. ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు కొద్ది సేపు నిరీక్షించక తప్పలేదు. ధాటిగా ఆడిన డకెట్ 39 బంతుల్లో ఏడు ఫోర్లతో 35 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 55 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. వన్‌డౌన్‌లో వచ్చిన ఓలి పోప్ ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే జాక్ క్రాలీ (20) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో ఇంగ్లండ్ 60 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను జో రూట్, జానీ బెయిర్‌స్టోలు తమపై వేసుకున్నారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కీకల ఇన్నింగ్స్ ఆడిన బెయిర్‌స్టో 5 ఫోర్లతో 37 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కొద్ది సేపటికే రూట్ (29), వికెట్ కీపర్ బెన్ పోక్స్ (4) కూడా ఔటయ్యారు.

స్టోక్స్ ఒంటరి పోరాటం..
ఒకవైపు వరుస వికెట్లు పడుతున్నా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ తన పోరాటాన్ని కొనసాగించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ స్టోక్స్ కీలక ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ స్కోరును 200 పరుగులు దాటించాడు. అతన్ని ఔట్ చేసేందుకు టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. టామ్ హార్ట్‌లి (23), మార్క్‌వుడ్ (11) అతనికి అండగా నిలిచారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్టోక్స్ 88 బంతుల్లో 3 సిక్సర్లు, ఆరు ఫోర్లతో 70 పరుగులు చేసి చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా మూడేసి వికెట్లను పడగొట్టారు. బుమ్రా, అక్షర్ పటేల్‌లు చెరో రెండు వికెట్లను తీశారు.

యశస్వి జోరు..
తర్వాత తొలి ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియాకు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కళ్లు చెదిరే శుభారంభాన్ని అందించాడు. యశస్వి ఆరంభం నుంచే దూకుడును కనబరచగా కెప్టెన్ రోహిత్ శర్మ సమన్వయంతో ఆడుతూ అతనికి అండగా నిలిచాడు. ఇద్దరు ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. రోహిత్ 3 ఫోర్లతో 24 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే క్రమంలో తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. మరోవైపు దూకుడుగా బ్యాటింగ్ చేసిన యశస్వి జైస్వాల్ 70 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 76 పరుగులు సాధించాడు. అతనికి శుభ్‌మన్ గిల్ 14 (నాటౌట్) అండగా నిలిచాడు.

స్కోరు బోర్డు:
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: జాక్ క్రాలీ (సి) సిరాజ్ (బి) అశ్విన్ 20, బెన్ డకెట్ ఎల్బీబి అశ్విన్ 35, ఓలి పోప్ (సి) రోహిత్ (బి) జడేజా 1, జో రూట్ (సి) బుమ్రా (బి) జడేజా 29, బెయిర్‌స్టో (బి) అక్షర్ 37, బెన్ స్టోక్స్ (బి) బుమ్రా 70, ఫోక్స్ (సి) శ్రీకర్ (బి) అక్షర్ 4, రెహాన్ అహ్మద్ (సి) శ్రీకర్ (బి) బుమ్రా 13, టామ్ హార్ట్‌లీ (బి) జడేజా 23, మార్క్‌వుడ్ (బి) అశ్విన్ 11, జాక్ లీచ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం 64.3 ఓవర్లలో 246 ఆలౌట్.
బౌలింగ్: బుమ్రా 8.31282, సిరాజ్ 40280, జడేజా 184883, అశ్విన్ 211683, అక్షర్ 131332.
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బ్యాటింగ్) 76, రోహిత్ శర్మ (సి) స్టోక్స్ (బి) లీచ్ 24, శుభ్‌మన్ గిల్ (బ్యాటింగ్) 14, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం 23 ఓవర్లలో 119/1.
బౌలింగ్: మార్క్ వుడ్ 2090, టామ్ హార్ట్‌లీ 90630, జాక్ లీచ్ 92241, రెహాన్ అహ్మద్ 30220.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News