లండన్: జాతి వివక్ష వ్యాఖ్యలకు పాల్పడిన ఆల్‌రౌండర్ ఒలీ రాబిన్‌సన్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రాబిన్‌సన్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ఇంగ్లండ్ బోర్డు ప్రకటించింది. 2012-13లో చేసిన జాతి వివక్ష, విద్వేష వ్యాఖ్యలపై విచారణ చేపట్టాలని ఇంగ్లండ్ బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం రాబిన్‌సన్ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే అతన్ని జాతీయ జట్టు నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు బోర్డు వెల్లడించింది. రాబిన్‌సన్ జాతీయ శిబిరాన్ని వదిలి ససెక్స్‌కు వెళ్లాడని వివరించింది. అంతేగాక ఎడ్జ్‌బాస్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే అతను ఆడడని బోర్డు స్పష్టం చేసింది. గతంలో రాబిన్‌సన్ ఆసియాకు చెందిన క్రికెటర్ల గురించి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. ఆసియా జాతులను అవమానిస్తూ ట్వీట్ చేశాడు.
అయితే ఈ ట్వీట్ చేసి ఇప్పటికే చాలా ఏళ్లు గడిచి పోయాయి. అయితే కివీస్‌తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా గతంలో రాబిన్‌సన్ చేసిన ట్వీట్ తెరపైకి వచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం లేచింది. మరోవైపు తన ట్వీట్‌పై రాబిన్‌సన్ పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశాడు. అందుకు క్షమాపణలు కూడా తెలిపాడు. అప్పుడు తెలియక ఇలాంటి ట్వీట్ చేశానని, ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఎంతో బాధపడ్డానని రాబిన్‌సన్ పేర్కొన్నాడు. అయితే ఇంగ్లండ్ బోర్డు మాత్రం అప్పట్లో రాబిన్‌సన్ చేసిన ట్వీట్‌ను తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని నిర్ణయించింది. అప్పటి వరకు రాబిన్‌సన్‌ను ఇంగ్లండ్ జట్టుకు దూరంగా ఉంచాలనే నిర్ణయం బోర్డు తీసుకుంది.
England Player Robinson suspended from All formats