లాహోర్: ఛాంపియన్స్ ట్రోఫీలో శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ తమ జట్టును భారీ స్కోర్ దిశకు తీసుకువెళ్లాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆరంభంలోనే ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(10), కీపర్ జెమీ స్మిత్(15) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన జో రూట్‌తో కలిసి బెన్ డకెట్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. వీరు ఇరువురు కలిసి మూడో వికెట్‌కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ క్రమంలో బెన్ డకెట్, జో రూట్ ఇరువురు అర్థశతకాలు సాధించారు. అయితే జంపా బౌలింగ్‌లో రూట్(68) ఎల్‌బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత కొంత సమయంలోనే డకెట్ సెంచరీ ఫూర్తి చేశాడు. మరో ఎండ్ నుంచి సరైన సహకారం అందకపోయినప్పటికి డకెట్ పరుగుల వరద పారిస్తూ.. 143 బంతుల్లో 17 ఫోర్లు 3 సిక్సులతో 165 పరుగులు చేశాడు. అయితే ఇతర బ్యాట్స్‌మెన్లు స్వల్పస్కోర్‌లకే పరిమితం అయినప్పటికి ఇంగ్లండ్ రికార్డు సాధించింది. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. ఇది ఛాంపియన్స్ ట్రోఫీలోనే అత్యధిక స్కోర్ కావడం విశేషం.