Saturday, November 23, 2024

ఎదురులేని ఇంగ్లండ్

- Advertisement -
- Advertisement -

England thrashed Australia by 8 wickets

రాణించిన బౌలర్లు, బట్లర్ విధ్వంసం, ఇంగ్లండ్ హ్యాట్రిక్ విజయం

దుబాయి: యుఎఇ వేదికగా జరుగుతున్న ట్వంటీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఇంగ్లండ్‌కు ఇది హ్యాట్రిక్ విజయం కావడం విశేషం. మరోవైపు ఆస్ట్రేలియా ఈ చాంపియన్‌షిప్‌లో తొలి ఓటమిని చవిచూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 11.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. సునాయాస లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాసన్ రాయ్, జోస్ బట్లర్ శుభారంభం అందించారు.

బట్లర్ ఆరంభం నుంచే చెలరేగి ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. మరోవైపు రాయ్ ఒక ఫోర్, సిక్స్‌తో 22 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 66 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. మరోవైపు డేవిడ్ మలాన్ (8) పరుగులు చేసి ఔటయయాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్‌తో అలరించిన బట్లర్ 32 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, మరో 5 బౌండరీలతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. బెయిర్ స్టో రెండు సిక్సర్లతో 16 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో ఇంగ్లండ్ మరో 8.2 ఓవర్లు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ సెమీస్‌కు మరింత చేరువైంది.

తేలిపోయారు..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను ఇంగ్లండ్ బౌలర్లు హడలెత్తించారు. లంకపై అద్భుతంగా ఆడిన డేవిడ్ వార్నర్ (1) ఈసారి నిరాశ పరిచాడు. స్టీవ్ స్మిత్ (1), మాక్స్‌వెల్ (6), స్టోయినిస్ (౦) విఫలమయ్యారు. ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ ఫించ్ 4 ఫోర్లతో 44 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వేడ్ (18), అగర్ (20) తప్ప మిగతావారు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోర్డాన్ మూడు, వోక్స్, మిల్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News