55 పరుగులకే ఆలౌట్
అదరగొట్టిన రషీద్
ఇంగ్లండ్ జయకేతనం
దుబాయి: ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ ఓటమిపాలైంది. శనివారం జరిగిన గ్రూప్‌ఎ రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆరు వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 55 పరుగులకే ఆలౌటైంది. ఇక విండీస్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ 8.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. జోస్ బట్లర్ 24 (నాటౌట్) జట్టును గెలిపించాడు. బౌలింగ్‌కు సహకరించిన ఈ పిచ్‌పై స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా ఇంగ్లండ్ తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది. అయితే బట్లర్ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ అత్యల్ప స్కోరుకే కుప్పకూలింది. జట్టు నిండ హిట్టర్లు ఉన్నా విండీస్ ఇన్నింగ్స్ 55 పరుగులకే కుప్పకూలడం ఎవరికీ అంతుబట్టకుండా మారింది. క్రిస్ గేల్ (13) ఒక్కడే రెండంకెల స్కోరును అందుకున్నాడు.
ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ చిరస్మరణీయ బౌలింగ్‌తో విండీస్ వికెట్ల పతనాన్ని శాసించాడు. అసాధారణ బౌలింగ్‌ను కనబరిచిన రషీద్ 2.2 ఓవర్లలో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఇక విండీస్ బ్యాటర్లు అత్యంత చెత్త బ్యాటింగ్‌తో పరువు తీశారు. సిమన్స్ (3), ఎవిన్ లూయిస్ (6), హెట్‌మెయిర్ (9), డ్వాన్ బ్రావో (5), నికోలస్ పూరన్ (1), కెప్టెన్ పొలార్డ్ (6), రసెల్ (0), మెక్‌కాయ్ (0), రవిరాంపాల్ (2)లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. హోసెన్ ఆరు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ నాలుగు, మిల్స్, మోయిన్ అలీ రెండేసి వికెట్లు పడగొట్టారు. వోక్స్, జొర్డాన్‌కు చెరో వికెట్ లభించింది.