Monday, December 23, 2024

వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన సూపర్8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గ్రూప్2లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బరిలోకి దిగిన ఇంగ్లండ్ 17.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ శుభారంభం అందించారు. కెప్టెన్ బట్లర్ సమన్వయంతో బ్యాటింగ్ చేయగా సాల్ట్ దూకుడును ప్రదర్శించాడు. సాల్ట్ అసాధారణ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి టీమ్ బౌలర్లను హడలెత్తించాడు. మరోవైపు బట్లర్ రెండు ఫోర్లతో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు.

తర్వాత వచ్చిన మోయిన్ అలీ ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. రెండు ఫోర్లతో 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కానీ జానీ బెయిర్‌స్టోతో కలిసి సాల్ట్ మరో వికెట్ కోల్పోకుండానే ఇంగ్లండ్‌కు విజయం సాధించి పెట్టాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించిన సాల్ట్, బెయిర్‌స్టో స్కోరును పరిగెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఆతిథ్య జట్టు బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చెలరేగి ఆడిన సాల్ట్ 47 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దూకుడును ప్రదర్శించిన బెయిర్‌స్టో 26 బంతుల్లోనే ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 48 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో ఇంగ్లండ్ 15 బంతులు మిగిలివుండగానే జయకేతనం ఎగుర వేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ మెరుగైన స్కోరును నమోదు చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్‌లు మెరుగైన ఆరంభాన్ని అందించారు. కింగ్ దూకుడుగా ఆడాడు.

13 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 23 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు చార్లెస్ సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న చార్లెస్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ నికోలస్ పూరన్ కూడా కీలక ఇన్నింగ్స్‌తో అలరించాడు. ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పూరన్ 4 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 36 పరుగులు చేశాడు. మరోవైపు కెప్టెన్ రొమన్ పొవెల్ చెలరేగి ఆడాడు. వరుస సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పొవెల్ 17 బంతుల్లోనే ఐదు సిక్స్‌లతో 36 పరుగులు సాధించాడు. చివర్లో రూథర్‌ఫర్డ్ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో అజేయంగా 28 పరుగులు చేశాడు. దీంతో విండీస్ ప్రత్యర్థి టీమ్ ముందు క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News