Saturday, November 16, 2024

ఈసారైనా పరువు దక్కేనా?.. సవాల్ వంటిదే

- Advertisement -
- Advertisement -

నేడు నెదర్లాండ్స్‌తో ఇంగ్లండ్ ఢీ

పుణె: ప్రపంచకప్‌లో అత్యంత చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు బుధవారం పసికూన నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్ సవాలుగా మారింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ఆరింటిలో పరాజయం పాలైన ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయినా పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్పితే మిగిలిన ఆరు మ్యాచుల్లోనూ ఇంగ్లండ్‌కు ఓటమే ఎదురైంది. ఇక నెదర్లాండ్స్ ఈ టోర్నమెంట్‌లో అసాధారణ ఆటతో అలరిస్తోంది.

ఇప్పటికే సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ వంటి బలమైన జట్లను ఓడించింది. తాజాగా ఇంగ్లండ్‌పై కూడా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నెదర్లాండ్స్ నిలకడైన ప్రదర్శన చేస్తోంది. జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. మాక్స్ డౌడ్, అకర్‌మన్, ఎడ్వర్డ్, బాస్ డె లీడ్, వాన్ బీక్ వంటి మ్యాచ్ విన్నర్లు నెదర్లాండ్స్‌లో ఉన్నారు. దీంతో ఈసారి కూడా విజయంపై నెదర్లాండ్స్ కన్నేసింది.

సవాల్ వంటిదే..
మరోవైపు ఇంగ్లండ్‌కు ఈ మ్యాచ్ సవాల్ వంటిదేనని చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆశించిన స్థాయిలో రాణించడంలో ఇంగ్లండ్ విఫలమవుతోంది. దీని ప్రభావం జట్టుపై బాగానే పడింది. బట్లర్, మలన్, బెయిర్‌స్టో, స్టోక్స్, రూట్, మోయిన్ అలీ, బ్రూక్, లివింగ్‌స్టోన్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు జట్టులో ఉన్నా ఫలితం లేకుండా పోతోంది. కెప్టెన్ జోస్ బట్లర్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. జట్టును ముందుండి నడిపించడంలో బట్లర్ పూర్తిగా విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది. మార్క్‌వుడ్, ఆదిల్ రషీద్, శామ్ కరన్, క్రిస్ వోక్స్‌లు బౌలింగ్‌లో బాగానే రాణిస్తున్నా బ్యాటింగ్ వైఫల్యంతో జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి స్థితిలో నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్ ఇంగ్లండ్ పరీక్షగా తయారైంది. ఇందులో ఎంతవరకు సఫలమవుతుందో వేచిచూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News