Monday, November 18, 2024

నేడు ఇంగ్లండ్‌ సౌతాఫ్రికాతో కీలక పోరు

- Advertisement -
- Advertisement -

ముంబై: వరుస ఓటములతో సతమతమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు శనివారం సౌతాఫ్రికాతో జరిగే పోరు సవాల్‌గా మారింది. ఇప్పటికే న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ చేతుల్లో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. అఫ్గాన్‌పై ఓటమి ఇంగ్లండ్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇక సౌతాఫ్రికా కూడా కిందటి మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇలాంటి స్థితిలో ఇటు ఇంగ్లండ్ అటు సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా తిరిగి గాడిలో పడాలని భావిస్తున్నాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాటర్లు బౌలర్లు ఉన్నారు. దీంతో ధర్మశాల వేదికగా జరిగే పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. కాగా, ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించడంతో ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందులో గెలిచి సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది.

కీలక ఆటగాళ్లు మలన్, బెయిర్‌స్టో, రూట్, లివింగ్‌స్టోన్ తదితరులు తమ స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచలేక పోతున్నారు. ఇది ఇంగ్లండ్‌కు ప్రతికూంగా మారుతోంది. కెప్టెన్ జోస్ బట్లర్‌లో కూడా జోష్ తగ్గింది. విధ్వంసక బ్యాటింగ్‌కు మరో పేరుగా చెప్పుకునే బట్లర్ ఆ స్థాయిలో బ్యాట్‌ను ఝులిపించలేక పోతున్నాడు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను ధాటిగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇతర బ్యాటర్లు కూడా సత్తా చాటక తప్పదు. బౌలర్లు కూడా మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే. అప్పుడే జట్టుకు గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. లేకుంటే మరో ఓటమి ఖాయం. ఇక సౌతాఫ్రికాకు కూడా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. నెదర్లాండ్స్ చేతిలో ఓడడంతో ఆటగాళ్లు ఒత్తిడిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బలమైన ఇంగ్లండ్‌ను ఓడించాలంటే అసాధారణ ఆటను కనబరచక తప్పదు. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో కీలక బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో ప్రత్యర్థి ఉంచిన లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదించలేక పోయింది. ఈసారి మాత్రం పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే లక్షంతో సఫారీ టీమ్ పోరుకు సిద్ధమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News