Wednesday, November 13, 2024

బట్లర్ వీరవిహారం..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : భారత్‌తో మంగళవారం జరిగిన మూడో ట్వంటీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 21 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 18.2 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ జోస్ బట్లర్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బట్లర్ 52 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఐదు ఫోర్లతో అజేయంగా 83 పరుగులు చేశాడు. అతనికి డేవిడ్ మలాన్ (18), జానీ బెయిర్ స్టో 40 (నాటౌట్) అండగా నిలిచారు. దీంతో అలవోక విజయాన్ని సాధించి సిరీస్‌లో పైచేయి సాధించింది.
ఆరంభంలోనే..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కెఎల్.రాహుల్ తన పేలవమైన ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తూ మరోసారి డకౌటయ్యాడు. మార్క్‌వుడ్ వేసిన అద్భుత బంతికి రాహుల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా నిరాశ పరిచాడు. రెండు ఫోర్లతో 15 పరుగులు చేసిన రోహిత్‌ను కూడా మార్క్‌వుడ్ వెనక్కి పంపాడు. ఆ వెంటనే యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా పెవిలియన్ చేరాడు. ఆరంగేట్రం మ్యాచ్‌లో విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న కిషన్ ఈసారి మాత్రం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో భారత్ 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.
ఆదుకున్న కోహ్లి..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను కెప్టెన్ విరాట్ కోహ్లి తనపై వేసుకున్నాడు. అతనికి యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అండగా నిలిచాడు. ఇక కోహ్లి అటు పంత్ కుదురుగా ఆడడంతో భారత్ కోలుకున్నట్టే కనిపించింది. ధాటిగా ఆడిన పంత్ మూడు ఫోర్లతో 25 పరుగులు చేసి రనౌటయ్యాడు. కొద్ది సేపటికే శ్రేయస్ అయ్యర్ కూడా పెవిలియ్‌దారి పట్టాడు. అయ్యర్ 9 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యతో కలిసి కోహ్లి పోరాటం కొనసాగించాడు. ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించిన కోహ్లి వరుస ఫోర్లు, సిక్సర్లతో స్కోరును పరిగెత్తించాడు. కోహ్లి తన మార్క్ షాట్లతో చెలరేగి పోగా హార్దిక్ సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 46 బంతుల్లోనే 4 సిక్సర్లు, మరో 8 ఫోర్లతో 77 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హార్దిక్ పాండ్య రెండు సిక్సర్లతో 17 పరుగులు చేసి చివరి బంతికి ఔటయ్యాడు. దీంతో భారత్ స్కోరు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 156 పరుగులకు చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్‌వుడ్ మూడు, జోర్డాన్ రెండు వికెట్లు పడగొట్టారు.

England Win by 8 wickets against IND in 3rd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News