ఆర్చర్ మాయ, రాణించిన రాయ్, బట్లర్, అయ్యర్ శ్రమ వృథా, తొలి టి20లో భారత్ ఓటమి
అహ్మదాబాద్: భారత్‌తో శుక్రవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 10 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 15.3 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
రాయ్ మెరుపులు..
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు జాసన్ రాయ్, జోస్ బట్లర్ శుభారంభం అందించారు. ఇద్దరు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. జాసన్ రాయ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. తన మార్క్ షాట్లతో భారత బౌలర్లను హడలెత్తించాడు. బట్లర్ కూడా తనదైన శైలీలో దూకుడును ప్రదర్శించాడు. ఇటు రాయ్, అటు బట్లర్ కుదరుగా ఆడడంతో ఇంగ్లండ్ లక్షం దిశగా సాగింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన బట్లర్ 24 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. అతన్ని చాహల్ వెనక్కి పంపాడు. అప్పటికే రాయ్‌తో కలిసి తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యంలో పాలు పంచుకున్నాడు.
కొద్ది సేపటికే రాయ్ కూడా పెవిలియన్ చేరాడు. ధాటిగా ఆడిన రాయ్ 32 బంతుల్లో మూడు సిక్సర్లు, మరో నాలుగు ఫోర్లతో 49 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 89 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. కానీ తర్వాత వచ్చిన జానీ బెయిర్‌స్టోతో కలిసి డేవిడ్ మలాన్ మరో వికెట్ కోల్పోకుండానే ఇంగ్లండ్‌కు విజయం సాధించి పెట్టాడు. కుదరుగా ఆడిన మలాన్ రెండు ఫోర్లు, సిక్స్‌తో 24 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు చెలరేగి ఆడిన బెయిర్‌స్టో 17 బంతుల్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 26 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో ఇంగ్లండ్ మరో 27 బంతులు మిగిలివుండగానే విజయాన్ని అందుకుంది.
శ్రేయస్ ఒంటరి పోరాటం..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఆతిథ్య టీమిండియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (1)ను జోఫ్రా ఆర్చర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఔటయ్యాడు. కోహ్లిను ఆదిల్ రషీద్ వెనక్కి పంపాడు. కోహ్లి ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ (4) ధావన్ కూడా ఔటయ్యాడు. అతన్ని మార్క్‌వుడ్ ఔట్ చేశాడు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యత తనపై వేసుకున్నాడు. అతనికి రిషబ్ పంత్ (21), హార్దిక్ పాండ్య (19) అండగా నిలిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ 48 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 67 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగతావారు విఫలం కావడంతో భారత్ స్కోరు 124 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టాడు.