Monday, January 27, 2025

అన్ని తరగతులకూ ఇంగ్లీష్ మీడియం

- Advertisement -
- Advertisement -

English medium for all classes in Telangana

తెలుగు మాధ్యమమూ కొనసాగింపు
ఆంగ్ల మీడియం బోధనకు టీచర్లకు ప్రత్యేక శిక్షణ
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద మొదటి దశలో 35 శాతం పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన
విలేకరులతో ఇష్టాగోష్ఠిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని తరగతులకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కూడా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేవలం ఒకటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం వల్ల ప్రస్తుతం వివిధ తరగతులు చదువుతూ ఇంగ్లీష్ చదువుకోవాలనుకునే విద్యార్థులు నష్టపోతారని, అందుకే అన్ని తరగతులకు ప్రారంభించాలని భావిస్తున్నామని అన్నారు. ఇంగ్లీష్ మీడియం బోధనకు టీచర్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొంతమంది టీచర్లకు అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీతో శిక్షణ అందించామని, విడతవారీగా మిగతా టీచర్లకు శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలుపై లోతైన అధ్యయనం చేసి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు.బుధవారం తనను కలిసిన విలేకరులతో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులతో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అనివార్యతపై ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సుధీర్ఘంగా చర్చించినట్లు మంత్రి పేర్కొన్నారు. గ్రామాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన చేపట్టాలని అందుకోసం కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని కేబినెట్ నిర్ణయించిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై తమ శాఖ కార్యాచరణ ప్రారంభించిందని వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలులో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్ధేశంతో దీనిపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందులో భాగంగా విద్యావేత్తలు, విద్యారంగ నిపుణులు, మేధావులు, విద్యార్థులు, తల్లిదండ్రులతోపాటు అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 40 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుందని, మిగతా పాఠశాలల్లో ప్రారంభించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే ముందుగా ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతున్న ప్రభుత్వ పాఠశాలలు, ఇతర పాఠశాలల విద్యార్థులకు సామర్థాలపై ఒక అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.

విద్యార్థులను ప్రాధమికస్థాయిలో ఇంగ్లీషు మీడియంలో బోధన కోసం టీచర్లకు తర్ఫీదునివ్వడం, విద్యార్థులకు ఆకర్షణీయంగా విద్యాలయాల పరిసరాలను తీర్చిదిద్దడం, వారిలో ఉత్సాహం కలిగించే విధంగా క్రీడామైదానాలు తదితర వసతులను ఏర్పాటు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వారికి మధ్యాహ్న భోజన వసతులను మరింతగా మెరుగుపరచడంపై దృష్టి సారించి పనులు ప్రారంభించామని అన్నారు. నాణ్యమైన ఇంగ్లీష్ విద్యను అందిచడం ద్వారా ప్రైవేట్ కార్పోరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని ఆ దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు.

అవసరాలకు మేరకు నియామకాలు

రాష్ట్రంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 3 లక్షల మంది విద్యార్థులు పెరిగారని మంత్రి వెల్లడించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం అమలు చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మరింత పెరుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల జిల్లాల కేటాయింపు పూర్తయిన తర్వాత, విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల నియామకాలు జరగలేదని కొందరు విమర్శలు చేస్తున్నారని, ఇది కాదని వ్యాఖ్యానించారు. 2017లో 800లకుపైగా టీచర్లను భర్తీ చేయడంతో పాటు గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం టీచర్లను భర్తీ చేసిందని పేర్కొన్నారు.

ఫీజుల నియంత్రణపై తిరుపతిరావు కమిటీ సిఫార్సులను పరిశీలిస్తాం

రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఫీజుల నియంత్రణ కోసం గతంలో ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ సిఫార్సులను పరిశీలించడంతో పాటు వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న చట్టాలు, విధానాలపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. ఫీజుల నియంత్రణపై ప్రైవేట్ యాజమాన్యాలు న్యాయస్థానాలకు ఆశ్రయించి అడ్డుకోకుండా న్యాయపరంగా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ప్రత్యేకంగా చట్టం రూపకల్పన చేసి, వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. సామాన్య, మధ్యతరగతి వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, అందుకు అనుగుణంగా సిఎం కెసిఆర్ నేతృత్వంలో అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మన ఊరు- మన బడి కింద మొదటి విడతలో 9,123 స్కూళ్లు

మన ఊరు- మన బడి కార్యక్రమం కింద మొదటి దశలో 35 శాతం స్కూళ్లలో మౌలిక సదుపాయానకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లోని ప్రతి మండలలో పాఠశాల ఉండేలా స్కూళ్లను ఎంపిక చేస్తున్నామన్నారు. మండలం కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకొని అన్ని రకాల పాఠశాలల్లో అత్యధికంగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పాఠశాలల్లో పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. తరగతి గదుల నిర్మాణ మిగతా అన్ని పనులు రెండు మూడు నెలల వ్యవధిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అందరూ భాగస్వామ్యం కావాలి

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు ప్రభుత్వం ఒక మహాయజ్ఞం చేపట్టిందని, ఈ యజ్ఞంలో అందరూ భాగస్వామ్యం కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. వివిధ హోదాలలో ఉన్న పాఠశాలల పూర్వ విద్యార్థులు, విదేశాలలో ఉన్న గ్రామస్థులు, వ్యాపారవేత్తలు అందరూ తమ వంతుగా ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తుంటే కొందరు రాజకీయ విమర్శలు చేయడం బాధాకమరని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యావిధానంలో మార్పులు తీసుకురావడానికి రాజకీయాలకు అతీతంగా విలువైన సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను మెరుగుపరించేందుకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. మహిళా యూనివర్సిటీ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మన ఊరు మన బడి కార్యక్రమం, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయాల అమలు ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడగలుగుతారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News