Wednesday, January 22, 2025

వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం

- Advertisement -
- Advertisement -

English medium from next year in Govt schools

ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతి వరకు అమలుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
ఫీజుల నియంత్రణపై మరోసారి భేటీ

మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని కోరుతూ కేబినెట్‌కు పంపాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆంగ్ల మాధ్యమం భోదనకు చేపట్టాల్సిన విధివిధానాలు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణపై ఏర్పడిన మంత్రివర్గ ఉప సంఘం విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన బుధవారం నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో మంత్రులు కె.టి.రామా రావు, టి. హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే విధివిధానాలను రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇంగ్లీష్ మీడియం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇంగ్లీష్ మీడియంలో చేరే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా ద్విభాషా(బై లింగ్వల్) విధానంలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను ముద్రించాలని సూచించింది.

ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు వీలుగా ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని అధికారులను మంత్రి వర్గ ఉప సంఘం అదేశించింది. విద్యార్థులకు ఇంగ్లీష్‌లో ప్రత్యేక మెలుకువలను నేర్పేందుకు అవసరమైతే టీ -సాట్ ద్వారా ప్రత్యేక కోర్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో డిజిటల్ క్లాస్ రూంలను ఏర్పాటు చేస్తున్నందున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని విద్యా శాఖ అధికారులకు సూచించింది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా భవిష్యత్తులో ప్రవేశాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడం తల్లిదండ్రుల ఆశయాలను, ఆకాంక్షలను సాకారం చేసే నిర్ణయంగా భావించాలని మంత్రి వర్గ ఉప సంఘం పేర్కొంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై మంత్రి వర్గ ఉప సంఘం విస్తృత స్థాయిలో చర్చించింది. ఈ విషయంలో మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని అభిప్రాయపడింది. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియ, ఉన్నతాధికారులు క్రిస్టీనా చోంగ్తు, దివ్య, ఉమర్ జలిల్, శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News