Thursday, January 23, 2025

ఆంగ్ల బోధన పేద విద్యార్థులకు మేలు

- Advertisement -
- Advertisement -

పాఠశాలలో మౌలిక వసతులకు నిధులపై ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు
జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య

English Teaching is good for poor students

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, మాజీ ఎమ్యెల్యే ఆర్. కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షత జరిగిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘాల సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. ప్రైవేట్ విద్య సంస్థల ఫీజులను నియంత్రించేందుకు చట్టం తీసుకురావడం జాతీయ బిసి సంక్షేమ సంఘం సుదీర్ఘ పోరాటాల విజయం అని అన్నారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో పాటు ‘మన ఊరు- మన బడి‘ రూ.7300 కోట్లతో ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ బడులను చక్కదిద్దానికి భారీ ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర కాబినెట్ సమావేశం నిర్ణయాలు తీసుకోవడంపై ఆర్.కృష్ణయ్య ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని బడుగు బలహీనవర్గాల విద్యార్థినీ, విద్యార్ధులకు ఎంతో మేలు చేకూరుతుందని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలనీ ముఖ్యమంత్రి కెసిఆర్‌కి ఆయన విజ్ఞప్తి చేశారు.

విద్యావ్యవస్థ సమూల మార్పుకోసం జాతీయ బిసి సంక్షేమ సంఘం తొమ్మిది సంవత్సరాల కాలంలో వందల సార్లు ధర్నాలు, ర్యాలీలు, ముట్టడులు, ప్రదర్శనలు నిర్వహించిందని అయన గుర్తుచేశారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేసే ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థలు పేద ప్రజలను లూటీ చేస్తున్నాయని, కొంత మంది పేద విద్యార్థులు అధిక ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమయ్యారని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టడం ద్వారా దళిత, గిరిజన, బహుజన, మైనారిటీ విద్యార్ధులు చదువుకొని అభివృద్ధి చెందుతారన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 24000 వేల టీచర్ పోస్టులు, ఎయిడెడ్ పాఠశాలలలో 4900 వేల టీచర్ పోస్టులు, గురుకుల పాఠశాలలలో 12000 వేల టీచర్ పోస్టులు,

కస్తూర్బా పాఠశాలలలో 1500 వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అలాగే కళాశాలల్లో 1500 వందల జూనియర్ లెక్చరర్ పోస్టులు, 2 వేల డిగ్రీ లెక్చరర్ పోస్టులు, విశ్వవిద్యాలయాలలో 2200 వేల అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటన్నిటిని భర్తీ చేసి విద్యావ్యవస్థను సమూలంగా పటిష్టం చేయడానికి తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆర్. కృష్ణయ్య కోరారు. సమావేశంలో రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి కోలా జనార్దన్, నేతలు సుధాకర్, పండరినాథ్, అంజి, లక్ష్మణ్‌యాదవ్, లక్ష్మి, భవ్య పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News