Monday, December 23, 2024

పెంచిన వికలాంగుల పెన్షన్ వెంటనే అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -
ప్రభుత్వానికి ఎన్‌పిఆర్‌డి వినతి

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పెంచిన 1000 రూపాయల పెన్షన్ వెంటనే అమలు చేస్తూ జీవో జారీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. జూన్ 9న మంచిర్యాల సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ వికలాంగుల పెన్షన్ మరో రూ. 1000 పెంచుతున్నామని, పెంచిన పెన్షన్ తో కలిపి జూలై నెల నుండి రూ. 4016 అమలు చేస్తామని ప్రకటించారని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. వెంకట్, ఎం. అడివయ్య, కోశాధికారి ఆర్. వెంకటేష్‌లు గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి ప్రకటనతో వికలాంగులు చాలా సంతోష పడ్డారని, ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అమలుకు మాత్రం నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై నెలలో ఇచ్చే పెన్షన్లు పెరిగిన పెన్షన్ వర్తింప చేస్తామని ప్రకటించి, ఇప్పటి వరకు ఇందుకు సంబంధించి జిఓ విడుదల చేయలేదన్నారు. పెరిగిన పెన్షన్ కోసం వికలాంగులు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇతర తరగతుల ప్రజలకు హామీలు ఇచ్చిన వెంటనే అమలుచేయడానికి జీఓలు జారీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పెంచిన పెన్షన్ అమలుకు ఎందుకు జిఓ విడుదల చేయడం లేదని వారు ప్రశ్నించారు. తక్షణమే జిఓ విడుదల చేసి ముఖ్యమంత్రి వికలాంగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడ్తామని ఎన్‌పిఆర్‌డి రాష్ట్ర కమిటీ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News