సిఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
పూర్తి చేయడానికి అధికారుల కసరత్తు
పలువురు అధికారులతో సిఎస్ భేటీ
వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశం
సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి జగదీశ్వర్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : నాగార్జున సాగర్ నియోజవర్గ పరిధిలోని ఐదు గ్రామాల్లో ఎంజాయ్‌మెంట్ సర్వేను పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నల్లగొండ పర్యటనలో భాగంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌కు సూచించారు. సిఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి, స్టాంపులు, రిజిష్ర్టేషన్‌ల ఐజి శేషాద్రి, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఐఆర్‌ఎస్, ఎండి జి.టి. వెంకటేశ్వర్ రావు, సిసిఎల్ స్పెషల్ ఆఫీసర్ సత్యశారదలతో గురువారం సమావేశం నిర్వహించారు.
తిరుమల సాగర్ మండలంలోని నెల్లికల్, చింతలపాలెం, తునికినూతల, జమ్మన్నకోట, ఎల్లాపురం (సుంకిషాల తండా) గ్రామాల్లో 3,495 ఎకరాల భూమికి సంబంధించి ఎంజాయ్‌మెంట్ సర్వేను వెంటనే చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను సిఎస్ ఆదేశించారు. డ్రాప్ట్ లిస్ట్‌ను పబ్లిష్ చేసి అభ్యంతరాలుంటే వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు. తదనంతరం అర్హులైన ల్యాండ్ హోల్డర్లకు పట్టాలు, పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలన్నారు.
మొత్తం ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలని సిఎస్ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. దీని వలన 1,700 మంది పేద రైతులకు, 3,495 ఎకరాల భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు అందనున్నాయి. దీనివలన రైతు బంధు, రైతుబీమా ప్రయోజనాలు పొందేలా అవకాశం కలుగుతుంది. సిఎం కెసిఆర్ ఈ సమస్యపై వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.