హైదరాబాద్: ఎస్ఎల్‌బిసిలో ప్రమాదం జరిగి దాదాపు పది రోజులు అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సిఎం రేవంత్ రెడ్డి కూడా ఘటన స్థలికి వెళ్లి సహాయకచర్యలకు పరిశీలించారు. మరోవైపు కొందరు ప్రతిపక్ష నేతలు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ప్రమాద ఘటన హైకోర్టుకు చేసింది. ఎస్‌ఎల్‌బిసి ఘటనపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ అనే సంస్థ టన్నెల్‌లో చిక్కుకున్న వాళ్లని సురక్షితంగా బయటకు తీసుకురావాలి అంటూ.. ఈ పిల్‌ను దాఖలు చేసింది.
ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా కార్మికుల ఆచూకీ తెలియకపోవడాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్(ఎజి) సుదర్శన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఆర్మీ, సింగరేణి రెస్క్యూ, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. 24 గంటలూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలను పరిశీలిస్తుందని చెప్పి వివరాలను హైకోర్టు నమోదు చేసి.. పిల్‌పై విచారణను ముగించింది.