జోషిమఠ్(ఉత్తరాఖండ్): ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్‌ఆర్‌ఎస్‌సి) జోషిమఠ్ ఉపగ్రహ చిత్రాలను, మొత్తం పట్టణం మునిపోయే అవకాశమున్న భూక్షీణత ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. చిత్రాలను కార్టోశాట్2ఎస్ ఉపగ్రహం నుంచి తీశారు. హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఎస్‌సి కుంగిపోతున్న ప్రాంతాల ఉపగ్రహ చిత్రాలను విడుదలచేసింది. చిత్రాలలో ఆర్మీ హెలిపాడ్, నరసింహ గుడి సహా యావత్ పట్టణంను సెన్సిటివ్ జోన్‌గా మార్క్ చేశారు.
ఇస్రో ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నివేదిక ప్రకారం, 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భూక్షీణత నెమ్మదిగా ఉండింది, ఆ సమయంలో జోషిమఠ్ 8.9 సెమీ. మేరకు కుంగింది. కానీ 2022 డిసెంబర్ 27 నుంచి 2023 జనవరి 8 మధ్య భూక్షీణత తీవ్రత పెరిగింది. జోషిమఠ్ పట్టణం 12 రోజుల్లో దాదాపు 5.4 సెమీ. కుంగిపోయింది.
భూమి కుంగిపోవడం వల్ల జోషిమఠ్ ఔలీ రహదారి కూడా దెబ్బతిననుందని ఉపగ్రహ చిత్రాలు చూయించాయి. జోషిమఠ్ పట్టణంలో భూక్షీణత తర్వాత ఇళ్లు, రోడ్లలో ఏర్పడిన పగుళ్లపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఇస్రో ప్రాథమిక నివేదిక వెల్లడించిన విషయాలు భయానకంగా ఉన్నాయి.