Monday, November 18, 2024

ప్రవేశ పరీక్షలు వాయిదా..?

- Advertisement -
- Advertisement -

సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతనే నిర్వహణ
ఇప్పటికే నీట్, జెఇఇ సహా పలు పరీక్షలు వాయిదా

ICSE and ISC exams 2021 postponed
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, ఉపాధ్యాయ విద్య, న్యాయవిద్య తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంల జెఇఇ మెయిన్, నీట్ సహా వివిధ పరీక్షలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 5 నుంచి 9 వరకు ఎంసెట్, జూలై 1న ఇసెట్, జూన్ 20న పిజిఇసెట్, ఆగస్టు 28న లాసెట్, పిజిఎల్‌సెట్, ఆగస్టు 24, 25 తేదీలలో ఎడ్‌సెట్, ఆగస్టు 19,20 తేదీలలో ఐసెట్ పరీక్షలు జరుగనున్నాయి. అలాగే గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్‌లో పాలిసెట్ జరగాల్సి ఉండగా, కొవిడ్ కారణాల దృష్టా పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియను నిలిపివేశారు. పాలిసెట్ మినహా మిగతా ప్రవేశ పరీక్షలకు ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నెల 22 వరకు లాక్‌డౌన్ విధించింది. కొవిడ్ కేసులు అదుపులోకి రాకపోతే మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎప్పటివరకు ఉంటుందో తెలియని పరిస్థితి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రవేశ పరీక్షలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాతనే ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్‌లో కొవిడ్ పరిస్థితులను బట్టి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఆలస్య రుసుం లేకుండా ఫీజులు..?

ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆలస్య రుసుం లేకుండా ప్రవేశ పరీక్షల ఫీజు చెల్లించే గడువు మరి కొన్ని రోజులలో ముగియనుంది. ఆ గడువును మరికొంత పొడిగించనున్నట్లు తెలిసింది. ఏటా ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించే గడువు ముగిసిన తర్వాత రూ.500 నుంచి రూ.10 వేల వరకు అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే ఈసారి సాధ్యమైనంత వరకు ఆలస్య రుసుం లేకుండానే విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షల రాసేందుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవడం మేలని పలువురు సూచిస్తున్నారు.

కొవిడ్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం : టి.పాపిరెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై కొవిడ్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి తెలిపారు. పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉంటే షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని, లేని పక్షంలో అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యార్థులు వారు హాజరయ్యే ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News