Monday, December 23, 2024

కల్లోనికుంట కవిత్వపు తడి

- Advertisement -
- Advertisement -

కవి హృదయ స్పందన కవిత్వమై జాలువారుతుంది. ఒక సంఘటనను గాని సన్నివేశాన్ని గాని చూసినప్పుడు మనసులో కలిగిన భావన ఒక తటిల్లతలా కవిత్వ రూపు కడుతుంది. అట్లా ఏనుగు నరసింహారెడ్డి గారి మదిలో మెదిలిన కవిత్వ మెరుపులే ’పూల పూల వాన’ గా తెలుగు కవిత్వ ప్రేమికుల హృదయాలను తడిపేసాయి. సాధారణంగా మనసును ఆకాశమంత విశాలమైనది అని, సముద్రమంత లోతైనది అని కవులు పోల్చుతూ ఉంటారు. కానీ నరసింహారెడ్డి ఆనందంతో గంతులు వేయడానికి అంతరంగం అంత పెద్దది ఏదీ తనకు కనిపించలేదంటారు. అంతరంగం ముందు ఆకాశం కూడా చిన్నదే అంటారు. పూల పూల వానలోని మినీ కవితల్లో కొన్నిచోట్ల అంత్యప్రాసలు మరింత శోభను చేకూరుస్తాయి.

‘కూలోల్లు కూచున్న/ మా అరుగు మేలు / నాల్గిండ్ల ముచ్చట/ సారమే తేలు‘ గ్రామీణ ప్రాంతాలలో ఇండ్ల ముందు అరుగులపై కూర్చుని గ్రామీణులు లోకాభిరామాయణమంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సహజ సుందర దృశ్యాన్ని తక్కువ మాటల్లో అందంగా ఆవిష్కరించారు నరసింహారెడ్డి. గ్రామీణ జీవితం పై ఈ కవికి ఎనలేని అభిమానం అనేక కవితల్లో దీన్ని మనం గమనించవచ్చు.
ఊరిని లాంగ్ షాట్ లో/ గీతన్నకు చూపించడమే కాదు/ మాకు లోకాన్ని ఊపి ఊపి చూపిస్తది/ మా ఊరి ఎవరెస్ట్ ఈ మినీ కవితలో గొప్ప భావచిత్రం దాగి ఉంది. తాటి చెట్టు నుండి గ్రామాన్ని గౌడన్న విహంగ వీక్షణం చేస్తాడు. దాన్ని లాంగ్ షాట్ ఫోటోగా అభివర్ణించడం కవి భావుకత. తాటి చెట్టును ఎవరెస్టుతో అభేదం చెప్పడం బాగుంది. ఇట్లాంటి మరొక భావ చిత్రాన్ని పాఠకుల మనోఫలకంపై చిత్రించే కవిత ’మర్రి మీద/ తాడు /తాటి స్తంభం మీద /లొట్టి వెలుగు…’ ఈ కవిత చదవగానే పల్లెటూరు తో సంబంధం ఉన్న ఏ పాఠకుడికైనా తాను చూసిన మర్రిచెట్టు పై తాటి చెట్టు వెంటనే స్ఫురిస్తుంది.

తాటి చెట్టులో కల్లును మాత్రమే చూడడం సరికాదని అది కావ్యాలు మోసిన తల్లిగా వర్ణించడం కవి చమత్కారానికి నిదర్శనం. గౌడు చెట్టు ఎక్కి/ చుక్కల్ని చూస్తాడు/ మోకు విప్పి /అంపశయ్యపై పవళిస్తాడు అనే కవితలో సౌందర్య దృష్టితో పాటు గీత కార్మికుల శారీరక అలసట తాలూకు బాధను పాఠకులకు వినిపిస్తాడు. ప్రాకృతిక సౌందర్యాన్ని ఒక ఇమేజ్ గా పాఠకుల ముందు ఆవిష్కరించడం ఈ కవికి కరతలామలకం. గుట్టెక్కితే /మబ్బు అందేది/ మా ఊరు /మహా పొడగరి అనే కవితలోనూ చక్కని భావదృశ్యాన్ని వీక్షించవచ్చు. ’ఏ పడవ లేకుంటే /నది మాత్రం ఎలా శోభిస్తది /నింగి నది అద్దంలో మెరవాలంటే/ ఒక్క మేఘమైన ఉండాలి కదా….’ సౌందర్యాన్ని ఆవిష్కరించిన తలమానికమైన కవిత ఇది. దిష్టి చుక్క ముఖానికి అందాన్ని ఇచ్చినట్లు కొన్నిసార్లు మరక మంచిదే అవుతుంది అనిపిస్తుందీ కవిత చదివితే.
ఇంత పచ్చటి/ పొలం చీర/ ఏటి మగ్గమే/ నేసింది సుమా… ఎంత అద్భుతమైన రూపకం…! పొలాన్ని చీరతో, ఏటిని మగ్గంతో అభేదం చెప్పడం ద్వారా అందంగా దృశ్యమానం చేయగలిగారు. ఇట్లాగే జీవితం మానిటర్, బ్లింకర్ శాంతి, ఎండ అద్దం, సచివాలయ సముద్రం, నది అద్దం, అలుగుదండ, చెరువు అద్దం … మొదలైన అందమైన రూపక అలంకారాలను ఈ కవిత్వంలో దర్శించవచ్చు.

చేదబావుల గిలకల శబ్దాలు, పల్లె పడుచుల పట్టు పరికిణిల అందాలు వంటి సహజ సౌందర్యాలు మనలను పల్లెకు లాక్కువెళ్తాయి. ఈ చిన్న కవితల్లోనూ మానవ సంబంధాలను లోతుగా విశ్లేషించగలిగారు.
ఆమె నీరు/ అత్తగారిల్లనే/ పాత్రలా/ఉంటుంది. స్త్రీ జీవిత ప్రస్థానంలో మెట్టినిల్లుఒక కీలక మలుపు. ఇన్నాళ్లు తను పెరిగిన వాతావరణం వేరు. అత్తవారింటిలో అడుగుపెట్టిన తరువాత వాతావరణం వేరు. అయినా ఆ వాతావరణానికి అనుగుణంగా సర్దుకుపోతుంది. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ రూపం దాల్చినట్లు స్త్రీ కూడా అట్లా అమరిపోతుంది అనే విస్తృతమైన భావాన్ని నాలుగు పదాల్లో చెప్పగలిగారు.

కొడుకు సమాధి మీద /పండు పెట్టి /తిను కొడుకా అంది/ దుఃఖం అవతారమెత్తిన తల్లి – పాషాణ హృదయులను సైతం కదిలించే కవిత ఇది. తల్లి దుఃఖం అవతారం ఎత్తడం కవి కవిత్వ నిర్మాణ నిపుణతకు దర్పణం. కన్నతల్లి స్పర్శ పిల్లలకు చెప్పలేనంత హాయిని కలిగిస్తుంది అన్నది కాదనలేని సత్యం ఈ అంశాన్ని కవి అత్యంత అందంగా అత్యంత ఆధునికంగా చెప్పిన తీరు చూడండి..
‘పాప లంకించుకున్న/ ఏడుపు ఆపే/ పాస్ వర్డ్ /అమ్మ పొడ.’ మనిషి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం పెళ్లి. పెళ్లికి నరసింహారెడ్డి గారు ఇచ్చిన నిర్వచనం నిత్య నూతనమైంది. పెళ్లి /రెండు అక్షరాల మాట కాదు / కనిపించని కోట్ల భావాల/ కోవెల.

వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదం చేసే చిరు కవితలు పూల పూల వానలో కోకొల్లలు. మందారం పెరుగుతుంటే/ ఇనుప గేటు బిక్క మొఖం/ అంత గట్టిగా ఉంటే / ఎదుగుదల కష్టం మరి… జీవితంలో పట్టువిడుపులు అవసరమని భీష్మించుకొని ఉండటం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమని చెప్పదలుచుకున్న కవి అర్ధాంతరన్యాసాలంకారాన్ని ధ్వనింపజేసే ఈ కవిత్వ వాక్యాల్ని వాడుకున్నాడు. అంత గట్టిగా ఉంటే ఎదుగుదల కష్టం అనే సామాన్య వాక్యాన్ని మందారం పెరుగుతుంటే ఇనుప గేటు బిక్క మొఖం వేసిందనే విశేష వాక్యంతో చక్కగా సమర్థించి చెప్పాడు.

గడియారం/ ఒక సమయమే చెబుతుందా/ ఇంకాస్త బాగా చూడు/ శ్రమను జపిస్తున్నట్లుంది అనే కవిత కూడా సందేశాత్మకమైనదే. నిరంతరం శ్రమించే గడియారం మానవులకు ఆదర్శం అని చెప్పకనే చెప్తారు. ఇదే గడియారాన్ని ప్రతీకగా చేసుకుని మరొక కవితలో ఎప్పుడూ ఆగొద్దని, ఎంత నడిచినా ఎక్కడికో పోలేమని గడియారం తెలియజేస్తుందంటారు. నిరంతరం శ్రమించే ప్రతీకగా ఒకచోట సెలయేరును కూడా చెప్తారు.

అర్ధరాత్రి కూడా /ఒక నిమిషం ఆగదు /సెలయేటికీ/ తనదైన క్రమశిక్షణ… స్వీయ క్రమశిక్షణ ఉన్నవారు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అటువంటి క్రమశిక్షణ అలవర్చుకోవలసిన అవసరాన్ని ఈ కవిత ద్వారా తెలియజేశారు పూలకే ఖరీదు/ తోటలో బేరమాడిరా/ సువాసనకు/ ధరల్లేవ్ అనే కవితలో కూడా లోతైన అర్థం దాగి ఉంది. భౌతికపరమైన వస్తు సేవలకు మాత్రమే ధరను చెల్లించగలం. ఆ సందర్భంలో ఎదుటివారితో వ్యవహరించే తీరు మర్యాద మన్ననలను ధరతో కొలువలేం కదా! వ్యక్తి అంతః సౌందర్యానికి ప్రతీకగా సువాసనను చెప్పవచ్చు. తన వెనుకబాటు తనం గురించి ఆలోచించడం కంటే ఎదుటివాడు ఎదుగుదలపై ఈర్ష్య అధికమైపోతున్న స్థితిని నేటి సమాజంలో గమనిస్తున్నాం.

ఎదిగిన వాళ్లను చూసి/ అసలే ఏడవలేదా/ అయితే నువ్వు / తప్పక ఎదిగే ఉంటావు అనే కవిత ఈ స్థితిని ప్రతిబింబిస్తుంది. ఎదుటివారి ఎదుగుదలను అభినందించడమే మన ఎదుగుదలకు కారణం అవుతుందన్న సందేశం ఈ చిన్న కవితలో నిగూఢమై ఉంది. మన గురించి మన మిత్రుల కంటే శత్రువులే పదే పదే మాట్లాడతారు అన్న విషయాన్ని నరసింహారెడ్డి వ్యంగ్యంగా, అందంగా చెప్పారు.

శత్రువుకు వందనం / నిజంగా అతనొక్కడే/ భుజాలు కందేలా /మనల్ని మోసుకు తిరుగుతాడు.. అనడంలో వ్యంగ్యం హాస్యం ధ్వనిస్తుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు… అనే కవితా పంక్తి నా చిన్నతనంలో పదేపదే వినే వాళ్ళం అదే స్థాయిలో ఉన్న మరో అందమైన కవితా పంక్తి పూల పూల వానలో కనిపిస్తుంది.
వాడు కత్తి పట్టుకుని /పువ్వుల్ని కోయగలడేమో కానీ/ రాబోయే వసంతాన్ని/ ఏ ఆయుధము ఆపలేదు… రాజ్యం లేదా బలవంతుడి దౌర్జన్యం సామాన్యుడిపై తాత్కాలికమైన ప్రభావాన్ని చూపించగలదేమో కానీ అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడం మాత్రం ఆపడం సాధ్యం కాదని కవి ఈ చెరువు కవిత ద్వారా చెప్పదలిచారు. ఈ కవితలో కత్తి పట్టుకున్న వాడు దోపిడీదారుకు ప్రతినిధిగా ఉంటే పువ్వులు సామాన్యుడికి ప్రతినిధిగా నిలిచాయి. అంతిమ విజయం సామాన్యుడిదే అనే కవి అభిలాష ఈ కవితలో ధ్వనిస్తుంది. అనుభవం అనేక గుణపాఠాలని నేర్పిస్తుంది.
‘చేతులు కలిపే వాడల్లా/ స్నేహితుడు కాడని/ బోర్లపడ్డాకే/ తెలిసొచ్చేది.. అనే ఈ కవిత అనుభవం నుండి పుట్టింది కాబోలు. స్వార్థం కోసం చేతులు కలిపే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ కవిత ద్వారా కవి హెచ్చరిస్తున్నాడు. మనిషి ఎంతటి సమర్థుడైనా ఎంతటి ఉత్తమ గుణాలు కలవాడైనా తనలోని ఒక లోపం లోకానికి తెలిసినప్పుడు అతని సమర్థతలకంటే లోకం లోపం వైపే చూస్తుంది. ఈ వాస్తవాన్నిచాలా అందంగా ఆవిష్కరించారు.

‘లోపం ఒకటి /ప్రచారంలోకి వచ్చిందా /సమస్త సమర్ధతలు/ చెరపట్టబడతాయి…’ అనే లోక విదితమైన సత్యం చక్కగా కవిత్వీకరించబడింది. ఈ చిరు పద్యాలలో నరసింహారెడ్డి గారి సామాజిక స్పృహ స్పష్టం అవుతున్నది. మీ పాళీల /పత్తులిరిగిపోను / ఇన్ని పేజీల పేపర్లో /ఒక నిజమూ రాయరే… అనే కవితలో నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఫోర్త్ ఎస్టేట్ ఇవాళ బడా బాబుల సంకనెక్కిన వైనాన్ని తూర్పారాబట్టారు. విద్యార్థిని జ్ఞాన తృష్ణ వైపు మళ్ళించడం, అతనికి చదువుల పట్ల ఆసక్తిని కలిగించడం ఉపాధ్యాయుల బాధ్యత. విద్యార్థి ఫెయిల్ అయ్యాడు అని అది విద్యార్థి తప్పుగా చెప్పడం తప్పు అంటారు నరసింహారెడ్డి.
ఫేలవడం అంటే/ మాస్టారికి/ సున్నా మార్కులు /వచ్చినట్లు లెక్క అని స్పష్టం చేస్తారు. నరసింహారెడ్డి గారి కవిత్వంలో ఎక్కడో ఒకచోట ఉన్న ఊరిని స్మరించుకోవడం కనిపిస్తుంది. ఆయనకు ఉన్న ఊరి పట్ల, తన మూలాల పట్ల ఎనలేని ప్రేమ. అది ఈ కవిత్వ సంపుటిలోనూ గమనించవచ్చు.
మూసి మతల్లి తడి /మా ఊరికీ తగిలినట్లుంది / కల్లోని కుంటలోనూ/ కవిత్వం… మూసి పరివాహక ప్రాంతం ఎందరో గొప్ప కవులకు నెలవు. కల్లోని కుంట కూడా మూసి సమీప గ్రామమే… నరసింహారెడ్డి గారిపై ఆ సాహిత్య ప్రభావం తప్పక ఉండి ఉంటుంది. ఐక్యత, సంఘజీవనం అవసరాన్ని తెలిపే కవితను చూడండి.. ’మన మొక్కరమే/ నూరు సార్లు నడిచినా /బాట పడదు/ కాళ్లు కలమెలిగినదే తొవ్వ…’

తాత్వికచింతనతో రాసిన మినీ కవితలు కూడా పూల పూల వానలో కనిపిస్తాయి. బొక్కెన జారింది /గిలక అరుస్తోంది /నూతిలో అలజడి /కొద్దిగంటే కొద్దిసేపే… ఈ కవితలో బుద్బుద ప్రాయమైన జీవిత పరమార్ధం దాగి ఉంది. నీటి బుడగ లాంటి మనిషి జీవితం ఎప్పుడు పరిసమాప్తమవుతుందో తెలియదు. మరణం తరువాత ఆ దుఃఖం కొద్ది సేపే. ఆ తర్వాత ప్రపంచం యధావిధిగా సాగిపోతూనే ఉంటుంది. ఇంతటి లోతైన అర్ధాన్ని నూతి బొక్కెనతో చెప్పడం కవిత్వ మర్మం తెలిసిన కవికి మాత్రమే సాధ్యం.
ఐదు /ఐదింట్లో కలిశాక /ఎంతటి ప్రేమైనా/ జలధిలో నిశ్శేషమే.. గాడమైన తాత్వికత కలిగిన కవిత ఇది. పంచప్రాణాలు పంచభూతాలలో కలిసిన తరువాత ఎంతటి ప్రేమ అయినా శూన్యం అవ్వాల్సిందే అనే భావన నర్మగర్భంగా తెలియజేశారు. మోసం చేసేవాడు బలహీనుడినే లక్ష్యంగా ఎంచుకుంటాడు. బలవంతుల జోలికి ఎంత మాత్రం వెళ్లడు. వలలు/ పులులని పడేయలేవు/ పిచ్చుకలపైనే /వాటి ధ్యాసఅంటూ లోక రీతిని తెలియజేశారు.
ఇంకా భూదాన్ పోచంపల్లి ఓఆర్‌ఆర్ గొప్పదనాన్ని చిత్రించే కవితలు నగ్నముని, వెలిగందల నారయ్య కవిత్వాన్ని స్పృశించే కవితలు పాఠకులను ఆకర్షిస్తాయి. మదిని దోసే కవిత్వ పుష్పాలను వానలా కురిపించి పాఠకులను మైమరపించిన నరసింహారెడ్డి కవిత్వానికి జేజేలు.

సాగర్ల సత్తయ్య
7989117415

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News