Monday, January 20, 2025

ఆదుకునే నిధికి ‘రిలీఫ్’ ఇచ్చినట్టేనా?

- Advertisement -
- Advertisement -

వాతావరణ మార్పులు మానవ జీవితాలపైన, ఆరోగ్యంపైన అనేక రూపాల్లో తీవ్రప్రభావాన్ని చూపిస్తున్నాయి. చక్కని ఆరోగ్యం, స్వచ్ఛమైన గాలి, సురక్షిత తాగునీరు, పౌష్టికాహార సరఫరా, రక్షణ కల్పించే ఆశ్రయం, ఇలాంటి సౌకర్యాలు, అవసరాలు అందకుండా వాతావరణ ప్రభావాలు దెబ్బ తీస్తున్నాయి. 2030 2050 మధ్యకాలంలో వాతావరణ మార్పువల్ల పోష్టికాహార లోపం, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు, అత్యధిక ఉష్ణోగ్రతల ఒత్తిడి సంభవించి ఏటా 2,50,000 వరకు అదనంగా మరణాలు సంభవిస్తాయని ప్రపంచ స్థాయి నివేదికలు వెల్లడిస్తున్నాయి.

2030 నాటికి ఆరోగ్యానికి ప్రత్యక్షంగా ఏటా 2 నుంచి 4 బిలియన్ డాలర్ల విలువైన నష్టం ఏర్పడుతుందని అంచనా. ఈ నేపథ్యంలో పర్యావరణ ప్రమాదాలతోపాటు ప్రమాదకర పదార్థాల బారిన పడిన వ్యక్తులను ఆదుకోడానికి 2008లో ఎన్విరాన్‌మెంట్ రిలీఫ్ ఫండ్ (ఇఆర్‌ఎఫ్) ను కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే 2019 లగాయితు ఈ రిలీఫ్ ఫండ్‌నుంచి ఎలాంటి నష్టపరిహారం చెల్లింపు కాలేదు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఇటీవల రాజ్యసభలో వెల్లడించడం గమనార్హం. ఈ ఎన్విరాన్‌మెంటల్ రిలీఫ్ ఫండ్ ఇటీవల సంవత్సరాల్లో ఎలాంటి వినియోగానికి నోచుకోక అచేతనంగా ఉండిపోయింది.

గత ఐదేళ్లలో ఈ ఫండ్ నుంచి ఏ విధమైన నిధులు ఖర్చుకాలేదు. 2023 మార్చి 31 నాటికి ఈ రిలీఫ్ ఫండ్‌లో దాదాపు రూ. 1062 కోట్లు పేరుకునిపోయి ఉన్నాయి. భోపాల్ గ్యాస్ ఏజెన్సీ విషాద సంఘటన తరువాత పబ్లిక్ లియబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ (పిఎల్‌ఐఎ) 1991 కింద ఈ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ప్రమాదకరమైన సంఘటనలకు చెందిన బాధితులకు తక్షణం ఆర్థిక సాయం అందించడానికే ఈ ఫండ్ ఏర్పాటైంది. పిఎల్‌ఐఎ కింద బీమాను వర్తింప చేసుకునే ప్రమాదకర పరిశ్రమల సహకారంతో పాటు, ఎన్‌జిటి చట్టం, 2010లోని సెక్షన్ 24 ప్రకారం పర్యావరణానికి నష్టం కలిగించినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) అందించే పరిహారం ఇఆర్‌ఎఫ్‌లో ఉంటుంది.

ఇంతటి కీలకమైన పాత్ర ఉన్నప్పటికీ ఈ ఫండ్ నిధులు ఏమాత్రం ఖర్చుకాకుండా అలాగే ఉంటున్నాయి. ఈ ఫండ్ నిధుల పంపిణీలో పారదర్శకతను మరింత పెంపొందించడానికి మార్గదర్శకాల నమూనా ప్రభుత్వం ఇటీవల విడుదల చేయడంతో ఈ ఫండ్ గురించి వివరాలు బయటపడ్డాయి. భారీ పర్యావరణ వైపరీత్యాల్లో బాధితులకు ఆర్థిక సాయం అందించడంలో జవాబుదారీతనం, స్పష్టత పెంపొందించేలా నిబంధనలను రూపొందిస్తూ జులై 25న నమూనా విడుదల చేశారు. ఈమేరకు ఆర్థికసాయం కోరుకునే వారు సంబంధిత కలెక్టర్లకు దరఖాస్తులు సమర్పించుకోవాలని సింగ్ సూచించారు. దీనిపై కలెక్టర్ ఫండ్ మేనేజర్‌ను నిధులు కలెక్టర్ అకౌంట్‌లో జమ చేయాలని ఆదేశిస్తారు. దాంతో ఆ నిధులను కలెక్టర్ సంబంధిత బాధితునికి పంపిణీ చేస్తారు. ఈ నిబంధనల ప్రకారం గత ఐదేళ్లలో బాధితుల నుంచి దరఖాస్తులు రాలేదని, ఇఆర్‌ఎఫ్ నుంచి ఎలాంటి నిధులు విడుదల కాలేదని సింగ్ చెప్పారు.

ఇంతేకాకుండా ఇఆర్‌ఎఫ్ నుంచి నష్టపరిహారం పొందడానికి నిర్దిష్టమైన నిబంధనలేవీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) జారీ చేయలేదు. పబ్లిక్ లియబులిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం రెండు రకాలైన నష్టపరిహారం ఇఆర్‌ఎఫ్ నుంచి పొందే అవకాశం ఉంటుంది. పర్యావరణ ప్రమాదాలకు సంబంధించి ఎన్‌జిటి నుంచి రిలీఫ్ పొందవచ్చు. రెండవది ప్రమాదకర సంఘటనల్లో ఆయా బాధితులకు కలెక్టర్ నిర్ణయాల ప్రకారం తక్షణ సహాయం పొందవచ్చు. కలెక్టర్ నుంచి పొందనున్న మొత్తం, పిఎల్‌ఎల్‌ఎ ఇన్సూరెన్స్ పాలసీ పరిధికన్నా మించిపోతేనే ఈ సహాయం అందుతుందని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ క్లైమేట్ అండ్ ఎకోసిస్టమ్స్ లీడ్ డెబాదిత్యో సిన్హా చెప్పారు. అయితే ఇప్పుడు కొత్తగా రూపొందించిన మార్గదర్శకాలు అన్ని చెల్లింపులు కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లకు నిధులు పంపిణీ చేయాలని ఫండ్ మేనేజర్లను ఆదేశించాయి.

ఈ నమూనా నిబంధనల ప్రకారం ఈ ఫండ్ పిఎల్‌ఎల్‌ఎ కింద పెనాల్టీని వడ్డీతో సహా వసూలు చేస్తుంది. లేదా ఇఆర్‌ఎఫ్ పెట్టుబడులపై వచ్చే లాభాలపై వడ్డీ వసూలు చేస్తుంది. ఈ ఫండ్‌ను ప్రత్యేకంగా ఫండ్ మేనేజర్ పర్యవేక్షిస్తుంటారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉంది. ఈ ప్రక్రియను సరైన పద్ధతిలో నిర్వహించడానికి, బాధితునికి సహాయం కచ్చితంగా అందడానికి తోడ్పడేలా ఈ చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇది అమలుచేసే విధానం బట్టి ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ‘జనవిశ్వాస్ బిల్లు పిఎల్‌ఎల్‌ఎను సవరించింది. పర్యావరణ ప్రమాదాలు, ఇతర అసాధారణ ప్రమాదాలకు సంబంధించి ఇఆర్‌ఎఫ్ నుంచి కావలసిన నిధులు డిమాండ్ చేసే అధికారాన్ని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లకు అప్పగించింది. ఈ విధమైన చర్య వల్ల ఇఆర్‌ఎఫ్ నిధులు సక్రమంగా వినియోగమయ్యే అవకాశం ఉంటుందని సింగ్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News