Wednesday, January 22, 2025

ప్రజా భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యం

- Advertisement -
- Advertisement -

‘చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం’లో కొండా సురేఖ

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రభుత్వ కృషికి ప్రజల భాగస్వామ్యం తోడైతేనే పర్యావరణ సమతుల్యత సాధ్యపడుతుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా నెక్నంపూర్ సరస్సు వద్ద నిర్వహించిన ‘చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవం ’ వేడుకలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటడంతో పాటు, చిత్తడి నేలలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఎగ్జిబిషన్ స్టాళ్ళను మంత్రి కొండా సురేఖ పరిశీలించారు. విద్యార్థులను ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రితో చేయి కలిపేందుకు ఉత్సాహం చూపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ, చిత్తడి నేలల సంరక్షణకు అనుసరించాల్సిన విధానాల పై మంత్రి సురేఖ మాట్లాడారు. పూర్వకాలంలో కాలుష్యం ఉండేది కాదని, జనాభా పెరుగుతున్న కొద్దీ ప్రజలు అవగాహన లేమితో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుండటంతో కాలుష్యం పెరుగుతున్నదన్నారు. నాడు రసాయనాల ప్రభావంలేని ఆహారాన్ని తిన్నవారు వయస్సు మీద పడినా ఆరోగ్యంగా ఉంటే, నేడు 30 ఏళ్ళు దాటితే చాలు బిపి, షుగర్, కాళ్ళ నొప్పులంటూ అనారోగ్యంబారిన పడుతున్నారని అన్నారు.

ప్రజలు తమ ఇల్లు పరిశుభ్రంగా ఉంటే చాలనే దృక్పథంతో సామాజిక బాధ్యతను విస్మరిస్తూ పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యమైన ప్రవర్తనతో పరిసరాలు అపరిశుభ్రమై, పీల్చే గాలి, తినే తిండి, తాగే నీరు కలుషితమవుతున్నాయని అన్నారు. ప్లాస్టిక్ మానవాళి పట్ల శాపంగా మారిందని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల స్థానంలో పేపర్ బ్యాగులను వాడాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. మనం ఏదైనా కార్యాన్ని అంతఃకరణ శుద్ధితో ఆచరించినప్పుడే ఇతరులకు చెప్తే ఆచరిస్తారని చెబుతూ ..ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమ హంస జీవితంలోని ఒక ఘట్టాన్ని ప్రస్తావించారు. పాఠశాలల ఉపాధ్యాయులు, యాజమాన్యాలు పర్యావరణ పరిరక్షణ దిశగా విద్యార్థులను ప్రోత్సాహించాలని సూచించారు.

పర్యావరణ పరిక్షణలో కీలకమైన చిత్తడి నేలలను కలుషితాల బారి నుంచి రక్షించినప్పుడే మానవ మనుగడకు, ఇతర జీవరాశుల మనుగడకు అనుకూల వాతావరణం నెలకొని ఉంటుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. రామ్ సర్ ఒప్పందం లో పేర్కొన్న ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశంలో 74 వెట్ ల్యాండ్ స్పాట్స్ ఉండగా, తెలంగాణ ప్రస్తుతానికి అమీన్‌పూర్‌లో ఒక వెట్ ల్యాండ్ స్పాట్‌ను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. టూరిస్టులు సేదతీరడానికి వెట్ ల్యాండ్ స్పాట్స్ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయని, వీటిని టూరిస్ట్ డెస్టినేషన్‌లుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రభుత్వ కార్యాచరణకు తోడు ప్రజల సహకారం తోడైతే చిత్తడి నేలల పరిరక్షణ మహాకార్యం విజయవంతమవుతుందని పిలుపునిచ్చారు. చిత్తడి నేలల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటి బోర్డ్ సెక్రటరీ కాళిచరణ్ ఎస్ ఖర్తడే, ఎం. సునీల, శిల్పా శర్మ తదితర అధికారులు పాల్గొన్నారు.

Konda Surekha

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News