Monday, December 23, 2024

పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం కల్పించాలి

- Advertisement -
- Advertisement -

మంథని రూరల్: గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతకు, పారిశుద్యానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని, ఇంకుడు గుంతల నిర్మాణ పనులు యుద్ద ప్రతిపాదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని నాగారం గ్రామంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం గ్రామపంచాయతీ భవనంలో పారిశుద్య నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

స్వచ్చ సర్వేక్షన్‌లో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో అవసరమైన కమ్యూనిటి ఇంకుడు గుంతలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రతకు, నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలన్నారు. అలాగే వార్డు వారిగా సమావేశం నిర్వహించి పరిసరాల పరిశుభ్రత, పారిశుద్యం, మరుగుదొడ్డి వినియోగం, మొక్కల పెంపకం, తడిచెత్త పొడి చెత్త, ఇంకుడు గుంతల ఏర్పాటుపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్లు, సైడ్ డ్రైయిన్‌లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.

ప్లాస్టిక్ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్‌ను పరిశీలించి ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలించారు. న్యాక్ భవనంలో శిక్షణ పొందిన గ్రామస్తులతో కలెక్టర్ చర్చించి వారికి ఉపాధి హామీ క్రింద పని లభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు శ్రీధర్, రాఘవులు, ఎంపీడీఓ రమేష్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News