2021 లో గుజరాత్‌లోని దోలవీరా దేవాలయం, తెలంగాణలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావడం జరిగింది. గతేడాది రవీంద్ర నాథుని శాంతి నికేతన్, కర్నాటకలోని హొయసాల దేవాలయం కూడా ఆ జాబితాలో చేరింది. భారత దేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన తాజ్‌మహల్ అజంతా, ఎల్లోరా గుహలు, హంపి, సూర్య దేవాలయాలు కోణార్క్, పశ్చిమ కనుములు, ఎర్రకోట, కజిరంగా అభయారణ్యం, కాంచన జంగ జాతీయ పార్కు లాంటివి పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వం సంపదగా గుర్తింపు పొందడం మనకు గర్వకారణం.ఇది ఆనాటి కాకతీయుల వాస్తు, శిల్ప రీతికి తలమానికం.
శ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలనను ప్రతిబింబించే ‘పురాతన కట్టడాలు’ ప్రపంచ వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన యునెస్కో ఆధ్వర్యంలో ‘ప్రపంచ వారసత్వ ప్రదేశాల’ గుర్తింపు, నిర్వహణ జరుగుతుంది. ప్రపంచ దేశాల వారసత్వ సంపద పరిరక్షణకై ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ పురాతన కట్టడాలు స్థలాల పరిరక్షణ సంఘం సంయుక్తంగా ఆఫ్రికాలోని ట్యునీషియాలో 1982 ఏప్రిల్ 18న సమావేశం నిర్వహించింది. ఆ రోజును ప్రతి ఏటా ప్రపంచ వారసత్వ దినోత్సవం గా జరుపుకొంటారు. ఈ సంవత్సరం వైవిధ్యతను కనుగొని అనుభవించు (discover and experience diversity) అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరగనుంది. యునెస్కో మానవాళికి అత్యుత్తమ విలువగా పరిగణించబడే విలక్షణమైన సాంస్కృతిక లేదా భౌతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను గుర్తించి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చుతుంది.
ముఖ్యంగా వివిధ దేశాల వైవిధ్యమైన అడవులు, పర్వతాలు, సరస్సులు, ఎడారిలు, కట్టడాలు, నగరాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడతాయి. ఒక దేశ సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ ఆ దేశ వారసత్వాన్ని భావితరాలకు అందించడంమే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా యునెస్కో వారసత్వం ప్రదేశాలలో 993 సాంస్కృతిక, 227 సహజ సిద్ధ, 39 మిశ్రమ స్థలాలుగా గుర్తించింది. వీటిలో 42 భారత్ కలిగి ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కలిగిన దేశాల జాబితాలో ఆరవ స్థానాన్ని ఆక్రమించింది. భారతదేశంలో పురాతన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే వారసత్వ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. సింధు నాగరికత, బౌద్ధ, అశోకుని కాలం నుంచి మొదటగా చారిత్రక నిర్మాణాలు, శిల్పకళ సంపద ఆరంభమైనది. ఇవన్నీ లౌకిక కట్టడాలు. అనంతర రాజుల శిల శాసనాలు, గుహలు , దేవాలయాలు, కోటలు వంటి కట్టడాలు మన చారిత్రక వారసత్వ సంపద గొప్ప నిదర్శనాలు. నేడు భారతీయ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలకు, కళా వైభవానికి పట్టుకొమ్మలుగా నిలుస్తున్న పురాతన కట్టడాలు వివిధ కారణాలతో కళను కోల్పోతున్నాయి.
పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, కాలుష్యం, అక్రమ నిర్మాణాలు, భద్రతలేమి, సహజ విపత్తులు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటివి దీనికి ప్రధాన కారణం. ఆగ్రాలోని పాలరాతితో నిర్మించిన తాజ్‌మహల్‌కు ‘నిర్లక్ష్యం, కాలుష్యం’ కలగలిసి ఈ అద్భుత నిర్మాణం మనుగడకే ముప్పుగా మారాయి. భారత దేశపు విశ్వవిఖ్యాత కట్టడం భవిష్యత్తు పట్ల కేంద్ర, రాష్ట్రాల అధికారుల నిర్లక్ష్యాన్ని సైతం సుప్రీం కోర్టు విమర్శించింది. తెలంగాణలోని వరంగల్ రామప్ప దేవాలయం కూడా సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్టింగ్ పనులతో ప్రమాదం పొంచి ఉంది. మన దేశంలో పురాతన ప్రదేశాల నమోదు, పరిరక్షిణపై నిర్లక్ష్యం కనిపిస్తోంది. పురావస్తు శాఖపై చిన్నచూపు ఉంది. భారతీయులకు తమ ఇతిహాసాల మీద ఉన్న శ్రద్ధ, చరిత్ర మీద లేదనే విమర్శ ఉంది.
మన రాజ్యాంగంలో సైతం ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలలో ‘వారసత్వ సంపద పరిరక్షణ’ అంతర్భాగంగా ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారసత్వ ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా ప్రకటించి ఆర్థిక వనరుగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. వారసత్వ కట్టడాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2015లో ‘హృదయ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గతేడాది దత్తత విధానంలో వాటి అభివృద్ధికి ‘అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ ప్రవేట్ -భాగస్వామ్యంతో స్మారక కట్టడాల అభివృద్ధికి కృషి చేయనున్నారు. అంతేకాకుండా ‘దేఖో అప్నాదేశ్ పీపుల్స్ చాయిస్ 2024’ పేరిట పర్యాటక శాఖ ఒక ఆన్‌లైన్ పోలింగ్‌ను ప్రారంభించింది.
దీంతో ఈ కట్టడాలు పర్యటకుల అవసరాల మేరకు అభివృద్ధి జరిగి, వాటిని వీక్షించేవారి సంఖ్య పెరగవచ్చు. మన పురాతన చారిత్రక కట్టడాలను దేశీయంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు వీక్షించే అవకాశం లేకుండాపోతుంది.ప్రయాణం, వసతి ఖర్చే దీనికి ప్రధాన కారణం. వాస్తవంగా వాటి నిర్మాణంలో దేశీయంగా కోట్లాది పేద ప్రజల శ్రమదాగి వుంది. మన దేశంలో ఘనమైన చరిత్ర కలిగి ఇంకా వెలుగులోకి రాని చారిత్రక కట్టడాలు అనేకం ఉన్నాయి. ప్రపంచ దేశాల సమన్వయంతో వెలికితీసి వాటి రక్షణకు కృషి చేయాలి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఆ దిశగా చర్యలు చేపట్టాలి. అప్పుడే ఇవి దేశ, విదేశాల పర్యాటకులను ఆకర్షించి ఆర్థికాభివృద్ధికి తోడ్పాడుతాయి. అంతేకాకుండా భవిష్యత్ తరాలకు మన చరిత్ర, సంస్కృతి చేరుతుంది.
సంపతి రమేష్ మహారాజ్
7989579428