Friday, November 22, 2024

 సామాజిక న్యాయంలో సమానత్వం?

- Advertisement -
- Advertisement -

Equality in social justice
రాజ్యాంగం అందుకోలేని జాతులు అంతరిస్తాయని బిఆర్ అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. జాతి ప్రయోజనాల కోసం పాటుపడకుంటే ఆ సామాజిక స్పృహ నశించిపోక తప్పదని కూడా అంబేడ్కర్ చెప్పిన మాటలు అక్షర సత్యమవుతున్నాయి. అందుకే ప్రభుత్వం నియమించే బిసి కమిషన్, బిసి కార్పొరేషన్, ఎంబిసి కార్పొరేషన్ ల ద్వారా అణగారిన వర్గాలకు కొంత న్యాయం చేకూరుతుందనే ఆశాభావం ఉంటుంది. ఆ సంస్థల ద్వారా ఆయా సామాజిక వర్గాలకు కొంత లబ్ధి చేకూర్చవచ్చనే అభిప్రాయమూ నాయకత్వాల్లో ఉంటుంది. అయితే ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో సదరు సంస్థలన్నీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా వర్ధిల్లాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక తెలంగాణలో ఏర్పడ్డ తొలి బిసి కమిషన్ నాలుగైదు బలమైన కులాలకే పరిమితం కావడం ఒకింత దురదృష్టకరం.

తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు ఏదో ఒక రూపంలో న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ప్రధానంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి కులాలకు రిజర్వేషన్లు పక్కగా అమలవుతున్నప్పటికీ చాలా వర్గాలకు తీరని అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. ముఖ్యంగా రాజకీయంగా అంటరాని అస్పృశ్యత ఆ వర్గాల్లో కొట్టొచ్చినట్టు కనపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో 34 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నా బిసిల్లో జనసంఖ్య అధికంగా ఉన్న ఐదారు కులాలకు మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప మిగిలిన వందకు పైగా కులాల్లో అడుగడుగునా అన్యాయమే జరుగుతున్నది.

తెలంగాణలోని బిసి జాబితాలో ఉన్న ఆదిమ జాతి కులాలు, విముక్త జాతులు, సంచార జాతుల కులాలు సర్పంచ్ పదవికి కాదు కదా వార్డు సభ్యుడికి పోటీ చేసే పరిస్థితి లేదు. తెలంగాణ రా్రష్ట్రంలో స్థానిక సంస్థలలో కల్పిస్తున్న 34 శాతం బిసి రిజర్వేషన్లను పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాలను సవరించి వర్గీకరించాలనే డిమాండ్, ప్రతిపాదన ఉన్నా ఎందుకో ఆచరణ సాధ్యం కావడం లేదు.

ఇక ప్రభుత్వం త్వరలో నియమించబోయే బిసి కమిషన్ పై అందరి దృష్టి పడింది. గత కమిషన్‌తో పోల్చితే ఈ సారి మరింత మెరుగైన పాలకవర్గం ఉంటుందనే ఆశాభావం బిసిల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం బిసి కమిషన్ ద్వారానే దాదాపు 24 కు పైగా అనాథ కులాలను, గుర్తింపు లేని కులాలను బిసి కుల జాబితాలో కలిపింది. దీంతో ప్రస్తుతం బిసి కులాల సంఖ్య 162 ఉండగా, ఇందులో బిసి ఎ 68, బిసి బి -28, బిసి సి -1, బిసి డి- 51 బిసి ఇ-14 ముస్లిం వర్గాలు ఉన్నాయి. 102 వ రాజ్యంగ సవరణ చట్టం 338 బి ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన హోదా కల్పిస్తూ బిసి కమిషన్ ఏర్పాటు చేసింది.

అదే పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా బిసి కమిషన్‌ను నియమించి చైర్మన్, వైస్ చైర్మన్ నలుగురు సభ్యులను నియమించాల్సి ఉంటుంది. అయితే బిసి కులాల్లో అత్యంత వెనుకబడిన వర్గాల వారు బిసి-ఎ లోని కులాలు. ఇందులో సంచార జాతుల కులాలు కూడా ఉన్నాయి. బిసి-ఎ జాబితాలోనే ఎక్కువ కులాలున్నాయి. పైగా బిసి-ఎ నుండే రాజకీయ, ఆర్థిక, సామాజిక చైతన్యం కొరవడిన కులాలే అధికంగా ఉంటున్నాయి. బిసిఎలో ఎంతో కొంత అవకాశాలున్న చాకలి, మంగలి కులాలు మినహా మేజార్టీ కులాలు సంచార, అర్ధ సంచార జాతులకు చెందిన కులాలే ఉన్నాయి. అందుకే ఈ సారి రాజ్యాంగ బద్ధంగా ఏర్పడబోయే బిసి కమిషన్ ద్వారానే అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది.

బిసి కమిషన్ ద్వారానైనా తమకు కొంత న్యాయం జరుగుతుందని ఆ మేరకు ప్రభుత్వం దూరదృష్టితో గుర్తిస్తుందని అత్యం త వెనుకబడిన వర్గాలకు చెందిన ఉన్నత విద్యావంతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. బిసి కమిషన్ ఏర్పాటుతో ఆయా జాతులపై సమగ్ర అధ్యయనం, నిరుద్యోగుల గుర్తింపు, కులాల గుర్తింపు తదితర అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఎంబిసి కార్పొరేషన్‌లో అత్యంత వెనుకబడిన వర్గాలను ఆదరించాలి. ఎంబిసి చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను కూడా నియమించి ఆయా కులాలకు సముచిత స్థానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎంబిసి కార్పొరేషన్‌లో ఉన్న బిసిలో ఉన్న ఉన్నత కులాలు, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కులాలకే సముచిత స్థానం లభిస్తుండడం కూడా ఒకింత విచారకరమే.

గత అరవై ఏళ్లుగా బిసిల్లో చాలా తేడాలున్నా ఇప్పుడు బిసిలను వర్గీకరించడం తెలంగాణలో తప్పనిసరి. బలమైన కులాలు ఎంత సేపు రాజకీయ ప్రాబల్యం కోసం ఆరాటపడుతుండగా, బిసిల్లోని కొందరు ఎంబిసిలు గుర్తింపు కోసం పరితపిస్తున్నారు. ఇక అదే బిసిల్లోని సంచార జాతులు వారి ఉనికే లేదని ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు విద్య ప్రయోజనాల కోసం బిసిలుగా వర్గీకరించారు.

హైదారాబాద్ రాష్ట్రం కూడా అదే విధానాన్ని అనుసరించింది. ఉమ్మడి రాష్ట్రంలో బిసిల గ్రూపుగా విభజించినా అదే ఫలితం. అయితే మద్రాసు, హైదారాబాద్ రాష్ట్రాలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో క్రిమినల్ ట్రైబ్స్ కోసం ప్రత్యేక విభాగాన్ని గుర్తించారు. ప్రత్యేక జాబితా ప్రకారం విద్య, ఉపకాల వేతనాలు వారికి ప్రత్యేక వసతి గృహాలను తయారు చేశారు. ఇప్పటికీ లబ్ధిదారులున్నారు. చాలా వరకు గిరిజన సంక్షేమ శాఖలో ఉండేవారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 1963 లో బిసిల జాబితా తయారు చేశారు. అనంతరం హైకోర్టు 1966లో ఆర్టికల్ 338 (3) ప్రకారం 112 కులాలున్నట్టు గుర్తించింది. ఆ తర్వాత 1970లో అనంతరామన్ కమిషన్ సిఫారసు మేరకు 90 కులాలను బిసి లుగా గుర్తిస్తూ ఎబిసిడిలు వర్గీకరించారు. సంచార జాతులను ఇందులో చేర్చి తీరని అన్యాయం చేశారు.

దీంతో సంచార జాతులు ఒక్కసారిగా గిరిజన సంక్షేమ శాఖ నుండి బిసి సంక్షేమ శాఖను మార్చారు. అనంత రామన్ కమిషన్ ఎ నుండి డి గ్రూపులో చేర్చిన కొన్ని కులాలకు తీరని అన్యాయం చేసింది. ఉప్పర, సగర వంటి శ్రామిక కులాలను ఏ ప్రాతిపదికన బిసి-డిలో చేర్చారో చెప్పలేదు. దశాబ్దాలుగా పాపం అలాంటి కులాలు ఇంకా బిసి-డిలో ఉంటూ అన్యాయానికి గురవుతున్నాయి. ఇక బిసి-ఎలో నాన్ ట్రైబల్‌ను చేర్చి కొన్ని సంచార జాతులకు అన్యాయం చేశారు. ఇలా చెప్పుకుంటేపోతే ఆరు దశాబ్దాలుగా బిసిలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

కొన్ని కులాలు ఆధునిక వృత్తుల్లోకి వెళ్లిపోగా మరికొన్ని కులాలు పాత వృత్తిని కొనసాగిస్తున్నాయి. చాకలి, మంగళి, ఆరెకటిక, వంజర, ఉప్పర, శాతాని లాంటి కులాలు వారి వృత్తులపై ఆధార పడుతూ విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. బాలసంత, బహురూపి, పూసల, పూసవేర్ల తదితర కులాలను గ్రామాల్లో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో చిన్న జాతిగానే చూస్తున్నారు. చాలా మంది వృత్తిపరమైన పనులు చేస్తూ గ్రామ పెద్దల దృష్టిలో నీచంగా చూడబడుతున్నారు. మరికొంత మంది వ్యవసాయ కూలీలుగా మారిపోయారు. మొత్తంగా వీరిని ఆదరణ లేని జాతులుగా మిగిలిపోయారు.

సంచార జాతులను వారి వృత్తులను బట్టి ట్రేడర్ నోమాడ్స్, హంటర్ నోమాడ్స్, కల్చరల్ నోమాడ్స్, ఆర్టిస్టిక్ నోమాడ్స్, శ్రామిక నోమాడ్స్‌గా గుర్తించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 85కి పైగా కులాలు 35 లక్షల జనాభా వరకు ఉంటారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర సర్వే ప్రకారం జనాభాలో దాదాపు 15 శాతం అంటే దాదాపు 9.70 లక్షల మందికి నివాస స్థలాలు లేకపోవడం దారుణం. కులం పేరు చెప్పుకునేందుకు సిగ్గుపడే దైన్య స్థితి. కులాల సంఖ్య కూడా తగ్గిపోయాయి. క్రూరమృగాలు, వేట మాంసం అటవీ శాఖలు అక్రమ కేసులు నిత్యకృత్యమవుతున్నాయి. బాలసంత, మొండిబండ వంటి కులాల పేరు చెబితే దొంగతనం కేసులు నమోదు చేసే పరిస్థితి.

ఇప్పటికీ సంచుల్లో మున్సిపల్ వ్యర్థాలను, ఖాళీ ప్లాస్టిక్‌ను సంచుల్లో మోసుకుని పోతున్నారు. ఇలా కులాలవారీగా చెప్పుకుంటేపోతే ఆ కులాల వృత్తులు నిర్వీర్యమయ్యాయి. కొద్దోగొప్పో చదువుకున్నా కులాల పేర్లు ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. చిరు వ్యాపారాలతో గ్రామీణ నాగరికతను వృద్ధిలోకి తెస్తున్న దాసరి, పూసల కులస్థులకు ఇవాళ ఎక్కడా చోటులేని పరిస్థితి. అందుకే కొత్త పథకాలతో కొంత పుంతలు తొక్కుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వం సంచార జాతులపై ఓ ముసాయిదాను విడుదల చేయాల్సిన అవసరం ఉన్నది. దశాబ్ద కాలంగా వీరికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది.

తాత్కాలికంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆర్థిక తాయిలాలు ప్రకటన కాకుండా వీరి కులాలు ఎన్ని? వీరి చరిత్ర ఏమిటి? ఈ కులాల బతకాలంటే ఏమి చేయాలో ఆలోచించాలి. సంచార జాతుల్లోని పేద కులాలు బాలసంత, పూసల, గంగిరెద్దుల, మందుల, వంశరాజు, వడ్డెర వంటి తదితరులను గుర్తించి ఎస్‌సి, ఎస్‌టిలో చేర్చేందుకు కేంద్రానికి సిఫారసు చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజానికి సంస్కృతిని నేర్పిన సంచార జాతుల సమగ్ర అధ్యయనం కోసం ప్రభుత్వ పక్షాన ఓ వేదిక ఏర్పాటు చేయాలి. సంచార జాతుల కమిషన్ కాని కార్పొరేషన్ కాని నియమిస్తే ఈ జాతుల స్థితిగతులపై అవగాహన ఉన్న వారితోనే ఆ జాతులకు న్యాయం చేయించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News