ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి…!
డిస్కంలు వేస్తున్న అభివృద్ధి ఛార్జీలపై వినియోగదారుల నుంచి అనేక అభ్యంతరాలు
ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్- చైర్మన్ (ఈఆర్సీ) చైర్మన్ శ్రీరంగారావు తెలిపారు. మార్చి 31లోపు విద్యుత్ సంస్కరణలపై ఈఆర్సీ తుది తీర్పు వెలువరిస్తుందని ఆయన వెల్లడించారు. ఇటీవల ఈఆర్సీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బహిరంగ విచారణ జరిపిందని, ఈ సందర్భంగా అనేక అంశాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. వాటిని పరిగణలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. పరిశ్రమలకు, మెట్రో సిటీలకు పీక్ లోడ్ విద్యుత్‌ను అందించే సమయంలో సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు తమకు విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం లేదని ఈఆర్సీ దృష్టికి తీసుకొచ్చాయన్నారు. డిస్కంలు వేస్తున్న అభివృద్ధి ఛార్జీలపై వినియోగదారుల నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రాయితీలు చెల్లించడం లేదన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ ఛార్జీల బకాయిలు భారీగా పెరిగిపోయిన విషయం వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు.