Thursday, January 23, 2025

సిబిఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బెయిల్‌పై బయట ఉన్న ఎ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాదులోని సిబిఐ కోర్టులో లొంగిపోయారు. అనంతరం, సిబిఐ కోర్టు ఎర్ర గంగరెడ్డికి జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో, సిబిఐ అధికారులు ఎర్ర గంగిరెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. తాను లొంగిపోయే విషయమై గంగిరెడ్డి ఇటీవలే స్పష్టత ఇచ్చారు. తన న్యాయవాదితో చర్చించానని, ఆయన సలహా మేరకు లొంగిపోతానని వెల్లడించారు. వైఎస్ వివేకా హత్య కేసు అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం 2019 మార్చి 28వ తేదీన గంగిరెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే నిర్ధిష్ట వ్యవధిలో ఛార్జిషీట్ దాఖలు చేయడంలో సిట్ విఫలం అయింది.

గంగిరెడ్డికి పులివెందులలోని స్థానిక కోర్టు 2019 జూన్ 27వ తేదీన డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆ తర్వాత ఈ కేసు సిబిఐ చేతికి వెళ్లింది. సిబిఐ విచారణ చేపట్టి చార్జిషీట్ దాఖలు చేసి, ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డిని ఏ1గా పేర్కొంది. ఆయన బెయిల్ ను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించింది. అయితే సిబిఐ పిటిషన్ కోర్టు కొట్టి వేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దిగువ కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సిబిఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గతేడాది నవంబర్‌లో ఆ హత్య కేసు విచారణను సుప్రీంకోర్టు ఎపి నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. దీంతో గంగిరెడ్డి బెయిల్ రద్దు కోసం సిబిఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎర్ర గంగిరెడ్డి సాక్షులను బెదిరిస్తూ, విచారణకు ఆటంకం కల్గిస్తున్నారని సిబిఐ ఆరోపించింది. మరోవైపు గంగిరెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి సిబిఐ వద్ద సాక్ష్యాధారాలు లేవని ఆయన తరఫు లాయర్ పేర్కొన్నారు.

అయితే ఇరువైపుల వాదనల అనంతరం సిబిఐ వాద నలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది. మే 5వ తేదీలోగా ఎర్ర గంగిరెడ్డి సిబిఐ కోర్టులో లొంగిపోవాలని అలా కాని పక్షంలో ఆయనను సిబిఐ అరెస్ట్ చేసేందుకు అనుమతించింది. ఈ క్రమంలోనే నాంపల్లిలోలని సిబిఐ కోర్టుకు వచ్చిన ఎర్ర గంగిరెడ్డి న్యాయవాదుల సమక్షంలో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. ఎర్ర గంగిరెడ్డి సొంతూరు కడప జిల్లా తొండూరు మండలం తేలూరు. గత 30 ఏళ్లుగా వివేకానందరెడ్డి, వైఎస్ కుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా వైఎస్ వివేకాకు ఆయన ప్రాణమిత్రుడు లాంటి వారు. వివేకాతో పాటే ఎప్పుడూ కనిపించేవారు. ఎర్ర గంగిరెడ్డి అవివాహితుడు. నూనె వ్యాపారంతో జీవితాన్ని ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో వివేకాతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

రాజకీయంగానూ ఎదుగుదల ప్రారంభమైంది. ఇప్పటికి కూడా వివేక తనకు దేవుడని ఆయన చెబుతుంటారు. ఆయనను హత్య చేయాల్సిన అవసరం కానీ హత్య చేయించడానికి ప్లాన్ చేయాల్సిన అవస రం కానీ లేదని చెబుతున్నారు. రంగయ్యతో అసలు పరిచయమే లేదని వాచ్‌మెన్‌గా చూశాను తప్ప ఎప్పుడూ మాట్లాడలేదని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News