వరంగల్: తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల ఎర్రబెల్లి దయాకర్ ప్రశంసించారు. వరంగల్ లో తెలంగాణ స్వాంత్రంత్య సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని గుర్తు చేశారు. స్వాతంత్ర్యోద్యమంలో, నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారని కొనియాడారు.
ఆసిఫాబాద్ నుంచి శాసనసభ్యుడిగా అనేక సార్లు ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారని, నిఖార్సయిన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ అని మెచ్చుకున్నారు. 97 యేండ్ల వయస్సులో కూడా తెలంగాణ కోసం పరితపించి మలి దశ ఉద్యమాలలో పాల్గొన్నారని, రాష్ట్ర చేనేత సహకార రంగానికి అనేక సేవలు చేశారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. స్వరాష్ట్రం కోసం 75ఏళ్లు ఉద్యమం చేశారని, బడుగు బలహీనవర్గాల అభివృద్ది కొరకు కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ఏర్పాటుకు తాను వుంటున్న జల దృశ్యాన్ని అప్పగించిన మహోన్నత వ్యక్తి గా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచిపోతారని, వారితో తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ జెడ్పీ చైర్మన్ సాంబారి సమ్మరావు, డిసిసిబి డైరెక్టర్ కకిరాల హరిప్రసాద్ రావు, వివిధ పద్మశాలి సంఘాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు.