Sunday, December 22, 2024

మహిళలు ఆర్థికంగా ఎదగాలి: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

మహిళలు ఆర్థికంగా ఎదగాలి : ఎర్రబెల్లి
ఎస్‌హెచ్‌జిలకు రూ.15037.40 కోట్లతో సెర్ప్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక
మహిళలకు ఇచ్చే రుణాల నిబంధనలను సడలించండి
సర్వీసు ఛార్జీలు లేకుండా.. అన్ని బ్యాంకుల్లో వడ్డీ రేటు అమలు చేయాలి
హైదరాబాద్: మహిళలు తమ పురోగతి కోసం ప్రణాళికలు రూపొందించుకుని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) 2023-24 వార్షిక సంవత్సరానికి గాను 308670 స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి రూ.15037.40 కోట్లతో రూపొందించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను, బియాండ్ ది బారియర్స్ అనే సక్సెస్ స్టోరీస్ – విజయ గాథల సమాహారాన్ని సెర్ప్ సీఈవో సందీప్‌కుమార్ సుల్తానియా, నాబార్డ్ సిజిఎం సుశీల చింతల, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ చైర్మన్ అమిత్ జింగా రాంజీ, రిజర్వుబ్యాంక్ ప్రతినిధి అనిల్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ఈ ఏడాది 308670 సంఘాల సాధికారిత కోసం రూ.15037.40 కోట్ల బ్యాంకు లింకేజీ లక్ష్యం నూరు శాతం సాధించాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.21 వేల కోట్ల రుణాలు మహిళా సంఘాలకు అందించగా, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన నాటి నుండి 68,522 కోట్లు మహిళలకు రుణాలుగా అందించినట్లు ఆయన పేర్కొన్నారు. తీసుకున్న రుణాలు మహిళలు సకాలంలో చెల్లిస్తున్నందున మహిళా సంఘాలపై బ్యాంకర్లకు ఎంతో నమ్మకం చేకూరిందని, సామాజిక గౌరవంతో పాటు, ఆత్మస్థైర్యం మహిళల్లో మరింత పెరిగిందని మంత్రి అన్నారు.

ఫ్లిప్ కార్ట్ తదితర వ్యాపార సంస్థలతో ఒప్పందాల ద్వారా వ్యాపార పారిశ్రామిక రంగాలలో మహిళలు రాణించాలని ఆయన కోరారు. 490 సంఘాలకు రూ.2910 కోట్లు ఈ ఏడాది వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలకు గాను ప్రభుత్వం బ్యాంకులకు భరోసానిస్తోందని ఈ కారణంగా ఎంత పెద్ద మొత్తంలో రుణాలు అందించి ఆర్థికంగా మహిళలను ఆదుకోవాలని బ్యాంకర్లకు మంత్రి సూచించారు. దేశంలో అత్యధికంగా మహిళల ద్వారానే 98 శాతం రికవరీ ఉంది. దేశంలో 57 శాతం మహిళలకు రుణాలు అందుతుంటే, మన రాష్ట్రంలో 76 శాతం రుణాలు మహిళలకే ఇస్తున్నాం. సగటున ఒక్కో ప్రతి సంఘానికి రూ.5,56,556 రుణాలుగా అందించామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో 32 జిల్లాల్లో 98 శాతం మహిళలు భాగస్వాములుగా డ్వాక్రా సంఘాలు పని చేస్తున్నాయి. 553 మండల సమాఖ్యలు, 4,30,358 స్వయం సహాయక సంఘాలలో 46,46,120 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. స్వయం సహాయక సంఘాల రుణ నిలువ ఈ ఏడాది 2023 మార్చి 31 నాటికి రూ.3,924.50 కోట్లుగా ఉందని మంత్రి తెలిపారు.

స్వయం సహాయక సంఘానికి సగటున రూ.10లక్షలు అంతకన్నా ఎక్కువ బ్యాంకు రుణం అందించడంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉన్నామని మంత్రి వెల్లడించారు. సిఈఓ సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ మహిళల ఆలోచన విధానంలో నేడు ఎంతో మార్పు వచ్చినందున లక్షలాది కుటుంబాలలో ఆర్థిక సామాజిక మార్పు చేకూరిందన్నారు. రెండు లక్షల మంది మహిళలు గత రెండేళ్లుగా పారిశ్రామికవేత్తలుగా మారారని బ్యాంకులు ప్రోత్సాహం అందించి వినూత్న పథకాలకు రుణ సౌకర్యం అందించి మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని కోరారు. రైతు ఉత్పాదక సంఘాలకు సంబంధించి రూ.100 కోట్ల టర్నవర్ నాలుగేళ్లలోనే సాధించినందున ఈ వ్యవస్థను బ్యాంకులు తమ మార్గదర్శకత్వంలో మరింత చేయూతనివ్వాలని ఆయన కోరారు. మహిళా సంఘాల రుణాల విషయంలో సర్వీస్ ఛార్జీలు ఉండరాదని, అదే విధంగా బ్యాంకులకు వడ్డీ రేట్లలో తేడా ఉండకుండా పరిశీలించాలని సూచించారు.

నాబార్డు సిజిఎం సుశీల చింతల మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలకు 54 శాతం రుణ సౌకర్యం అందించబడగా తెలంగాణలోని 76 శాతం మహిళలకు రుణ సౌకర్యం లభిస్తోందన్నారు. ఆర్‌బిఐ ప్రతినిధి అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రణాళిక బద్దంగా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ లక్ష్యం నిర్ధారించడం అభినందనీయమన్నారు. బ్యాంకులు తమ లక్ష్యాన్ని నూరు శాతం సాధించాలన్నారు. ఎస్‌ఎల్‌బిసి చైర్మన్ అమిత్ జింగారాంజి మాట్లాడుతూ ఆదాయ మార్గాలను గుర్తించి రుణాలు ఇవ్వడం ద్వారా పేదరిక నిర్మూలన నూరు శాతం సాధ్యపడుతుందన్నారు. ఎన్ పి ఏ 1.66 శాతం మాత్రమే ఉన్నందున ఆయన అభినందించారు. నిర్దేశించిన బ్యాంకు లింకేజీ వార్షిక లక్ష్యాన్ని అన్ని బ్యాంకులు సకాలంలో సాధించాలని కోరారు. కార్యక్రమంలో గతేడాది నిర్దేశించిన లక్ష్యం సాధించిన బ్యాంక్ అధికారులను, ఉత్తమ మహిళా సంఘాలను, అధికారులను ప్రశంసా పత్రాలు, మెమొంటోలతో సత్కరించారు. అంతకుముందు రాష్ట్రంలోని వివిధ మహిళా సంఘాల మహిళలు అనిత, మంజుల, లలిత, సంతోష లు తమ అనుభవాలను, విజయగాథలను వివరించారు. కార్యక్రమంలో సెర్ప్ డైరెక్టర్ వైఎన్ రెడ్డి, సెర్ప్ లోని వివిధ విభాగాల డైరెక్టర్లు, వివిధ సంఘాల మహిళలు, అధికారులు, డిఆర్ డిఓలు, ఎపిడిలు, తదితరులు పాల్గొన్నారు.

Also Read: ట్రక్కు డ్రైవర్లతో అద్భుతమైన సంభాషణ.. వీడియో షేర్ చేసిన రాహుల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News