పునరావాస కేంద్రాలను సంసిద్ధం చేయాలి
వరద బాధితుల కోసం అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్ల
టెలి కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దిశానిర్దేశం
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గల ఐదు జిల్లాల ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఉన్నత అధికారులతో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించిన తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదవుతున్న వర్షపాతం, వరదలు, లోతట్టు ప్రాంతాల జలమయం, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర పరిస్థితుల్లో, రెస్క్యూ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు తదితర అంశాలపై.. ఆయా జిల్లాల పరిస్థితిని, వాళ్ళు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను ఆ జిల్లాల కలెక్టర్లు మంత్రులు ఎర్రబెల్లి, మంత్రి సత్యవతి, ఇతర ప్రజా ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల జిల్లాల్లో రెడ్, ఆరెంజ్ అలెర్ట్ ఉందని ప్రజలకి ఏ సమస్య ఉన్నా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తే వెంటనే అధికారులకు తెలియచేయాలని, అలాగే తగిన విధంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు. నియోజకవర్గ పరిధిలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ సమయంలో ఏ ఆపద వచ్చిన వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండి సిద్దంగా ఉండాలని ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టరేట్‌లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో వున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి చేర్చాలని, అలాగే పునరావాస కేంద్రాల్లో వారికి భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇదే సందర్భంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు.