ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రణీత్ రావు ఎవరో కూడా తనకు తెలియదని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను కావాలనే ఇరికిస్తున్నారన్నారు. ప్రణీత్ రావు తనకు తెలియదు కాని.. ఆయన బంధువులు మాత్రం తన ఊరిలోనే ఉన్నట్లు చెప్పారు. గతంలో తనను ఇబ్బంది పెట్టాలని చాలా ప్రభుత్వాలు ప్రయత్నించాయి.. కాని, వాటి వల్ల కాలేదన్నారు.
శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై ఆరోపణలు చేసినట్లు మీడియాలో చూశానన్నారు. దీంతో శరణ్ ఎవరని విచారించగా.. అతడు బీజేపీలో ఉన్నట్లు తెలిసిందన్నారు. భూముల దందాలు, మోసాలు చేస్తున్నాడని అతడిని బీజేపీ తొలగించిందని చెప్పారు. ఎన్నారైలను కూడా కోట్ల రూపాయాలు మోసం చేసినట్లు తెలిసిందని.. అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. 40 ఏండ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా పనిచేశానని.. అక్రమ దందాలు, భూ కబ్జాలు చేయలేదని చెప్పారు.
విజయవాడకు చెందిన విజయ్ అనే ఎన్నారై దగ్గర శరణ్ చౌదరి రూ.5 కోట్లు తీసుకున్నాడని చెప్పారు. విజయ్ ఎవరో తనకు పరిచయం లేదని వెల్లడించారు. ఎన్నారైలు విజయ్‌ని తన దగ్గరికి తీసుకొచ్చారని, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించాని తెలిపారు. శరణ్ చౌదరిపై అనేక చీటింగ్ కేసులు ఉన్నాయని, అతనితోపాటు ఆయన భార్య పాస్ పోర్ట్ కూడా పోలీసులు సీజ్ చేశారని తెలిపారు. రాజకీయంగా తనను దెబ్బ తీయాలని కొందరు తనపై కుట్ర చేస్తున్నారని.. అందులో భాగంగానే తనను తప్పుడు కేసులో ఇరిక్కించాలని చూస్తున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు.