Saturday, December 21, 2024

సంజయ్, రేవంత్‌ల మాటలకు ఎన్నిసార్లు వెలివేయాలి

- Advertisement -
- Advertisement -

వరంగల్‌ బ్యూరో : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీలకతీతంగా మేమంతా రాహుల్‌గాంధీ కోసం, బిజెపి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలింగ్, సెటిల్‌మెంట్లతో బిజీబిజీగా గడుపుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాల శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఘాటుగా విమర్శించారు. రాహుల్ అనర్హతపై బిజెపి చేసిన చర్యను దేశ వ్యాప్తంగా ఖండిస్తున్నామని, బిఆర్‌ఎస్ రాహుల్‌గాంధీకి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు బిఆర్‌ఎస్‌పై ప్రతిరోజు బురదజల్లే చర్యలకు ఒడిగడుతూ నిరాధార, నిందారోపణలు చేస్తున్నారని మంత్రి దయాకర్‌రావు ఆరోపించారు.

వీరి నిరాధారణ ఆరోపణలకు ఎన్నిసార్లు పార్లమెంట్ నుండి వెలివేయాలో ఆలోచించుకోవాలన్నారు. హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దయాకర్‌రావు మాట్లాడారు.. రాజకీయ ఆరోపణలను నిరూపించాలని పట్టుపట్టి కేసులు పెట్టి పార్లమెంట్ నుండి మెడపట్టి గెంటేస్తే బిఆర్‌ఎస్‌పై, తెలంగాణ ప్రభుత్వంపై, సిఎం కెసిఆర్‌పై నిరాధార, నిందారోపణలు చేస్తున్న బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలను ఎన్నిసార్లు వెలివేయాలని ఆయన ప్రశ్నించారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని నిందించకుండా ఆపార్టీకి భయపడుతూ స్థానికంగా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

రాహుల్‌గాంధీపై అనర్హత వేటు బిజెపి నియంతృత్వానికి, అణిచివేతకు నిదర్శనమన్నారు. ప్రశ్నించే గొంతులపై బిజెపి ఉక్కుపాదం మోపుతుందనడానికి నిదర్శనమన్నారు. దేశంలో బిజెపి పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు. ప్రజాస్వామ్యంలో పశ్నించడం తప్పు కాదని దాని తీవ్రతలో తేడాలుంటే నిరూపించమని కూడా అడుగవచ్చన్నారు. దానికి భిన్నంగా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం సిగ్గు చేటన్నారు. పరువు నష్టం కేసులో వేసిన శిక్షకే అనర్హత వేటు వేస్తే క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడ్డ బిజెపి ఎంపిలు చాలామంది ఉన్నారని, వారి సంగతేంటని ప్రశ్నించారు. వారిపై ఇప్పటి దాకా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఎందుకు అనర్హత వేటు వేయలేదన్నారు. అలాంటి బిజెపి ఎంపిలను కూడా బహిష్కరిస్తారా అని ప్రశ్నించారు.

సిఎం కెసిఆర్ పరిపాలనలో ప్రజలు సభీక్షంగా ఉండే లేనిపోని అపోహలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ నోటికొచ్చినట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడే మాటలకు పార్లమెంట్ నుండి బహిష్కరిస్తారా అని ఆయన బిజెపిని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో బిజెపికి తగిన గుణపాఠం చెపుతారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News