మనతెలంగాణ/ హైదరాబాద్ : తొర్రూరుకు చెందిన అబ్బోజు ప్రమోద్‌కుమార్‌కు ఉద్యోగం రాగా.. అతని ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరించిన ప్రైవేట్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి, సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఒప్పించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన ఉదారతను చాటుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ప్రమోద్ బాసర ట్రిపుల్ ఐటి చదివాడు. 2019 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్ష రాయగా, జూనియర్ ఇంజనీర్ సిగ్నల్,టెలీ కమ్యూనికేషన్ డిపార్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. వెంటనే ఉద్యోగంలో చేరాలని ఆదేశాలు వచ్చాయి. ఈ లోగా తాను పని చేస్తున్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఈ విషయం చెప్పగా అతడి ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి నిరాకరించారు.
రూ.2 లక్షలు జమానత్ కింద డిపాజిట్ ఉన్నప్పటికీ, ఒప్పందానికి విరుద్ధంగా మధ్యలోనే వెళ్లి పోతున్నందున కొంత డబ్బు కట్టాలని డిమాండ్ చేశారు. తన కుటుంబ ఆర్థిక స్థోమత అంతగా లేదని బతిమిలాడినా పట్టించుకోలేదు. దీంతో ప్రమోద్ తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుని కలిశారు. వెంటనే సంబంధిత కంపెనీ యాజమాన్యంతో మంత్రి మాట్లాడి ప్రమోద్‌కు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇచ్చేలా ఒప్పించారు. మంత్రి ఔదార్యానికి ప్రమోద్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. తాను తొర్రూరులో పదో తరగతిలో ఉత్తమ ర్యాంకు సాధించిన సమయంలోనూ మంత్రి తనను ప్రోత్సహించారని, ఆయన సహకారంతో, స్ఫూర్తి తోనే తాను ఈ ఉద్యోగం పొందానని ప్రమోద్ సంతోషంతో చెప్పాడు.